Wednesday, January 8, 2025

మృత్యుశకటం

- Advertisement -
- Advertisement -

బీజాపూర్ రోడ్డు ఆలూరు గేటు
వద్ద ఘోర ప్రమాదం
కూరగాయల విక్రేతలపైకి
దూసుకెళ్లిన లారీ నలుగురు
మృతి..మరో పది మందికి
గాయాలు నలుగురి పరిస్థితి
విషమం ఆసుపత్రికి తరలింపు
లారీ చెట్టును ఢీకొనడంతో
డ్రైవర్‌కు తీవ్రగాయాలు

మన తెలంగాణ/చేవెళ్ల : హైదరాబాద్‌బీజాపూర్ అంతర్‌రాష్ట్ర రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు కింద కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి సిమెంట్ లారీ మృత్యురూపంలో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో పది మందికి గాయాలయ్యాయి. వీ రిలో నలుగురి పరిస్థితి విషమమంగా ఉంది. వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమమంగా ఉన్న నలుగురిని మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా , చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గేటు సమీపంలో కొందరు రైతులు తాము పండించిన కూరగాయలను, మరికొంతమంది చిరువ్యాపారులు రోడ్డు కిందకు కూరగాయలను అమ్ముకుంటుంటారు. ఇదే క్రమంలో సోమవారం సాయంత్రం వారు కూరగాయలు అమ్ముకుంటుండగా చేవెళ్ల మీదుగా వికారాబాద్ వైపు ఓ లారీ వెళ్తోంది. ఒక్కసారిగా లారీ అదుపుతప్పి కుడివైపున కూరగాయలు విక్రయిస్తున్నవారిపైకి దూసుకువచ్చింది. వారు తేరుకునేలోపే లారీ వారిని బలంగా తాకడంతోపాటు చెట్టును ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో ఆలూరు గ్రామానికి చెందిన నక్కలపల్లి రాములు (42), దామరగిద్ద కృష్ణ (22), ఇంద్రారెడ్డినగర్‌కు చెందిన సుజాత( 40) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

మరో పదిమందిని లారీ ఢీకొనడంతో అక్కడక్కడ చెల్లాచెదురుగా పడిపోయారు. వారిలో నలుగురు ఆకుల పద్మమ్మ, బాలమణి, చల్లా మల్యాద్రి, లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. లారీ చెట్టును బలంగా ఢీకొట్టండంతో లారీ ముందు భాగం ఛిద్రమై డ్రైవర్ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయిపోయి అందులోనే ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లో క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను ప్రభుత్వ ఏరియాసుపత్రికి తరలించారు. ఎసిబి సహాయంతో లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని హృదయవిదారకంగా విలపించారు.రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంఎల్‌ఎ కాలె యాదయ్యతో పాటు పార్టీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి పామెన భీంభరత్, పొల్యూషన్ బోర్డు సభ్యులు చింపుల సత్యనారాయణరెడ్డి చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను తమ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని భరోసానిచ్చారు. మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్సగ్రేషియా అందేవిధంగా సిఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతామని వారి కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు. చేవెళ్ల మాజీ ఎంఎల్‌ఎ, బిజెపి నాయకుడు కెఎస్ రత్నం చేవెళ్ల ప్రభుత్వ ఏరియాసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే మెరుగైన వైద్యసహాయం అందించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే మన్నేగూడ నుంచి అప్పా వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు స్థానిక భాజపా నాయకులు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, అత్తెల్లి అనంత్‌రెడ్డి, డాక్టర్ వైభవ్‌రెడ్డి, గుండన్నగారి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News