Monday, January 20, 2025

‘చెన్నై’ కోసం కుటుంబం బలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన హైదారాబాద్‌లోని తార్నాకలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో నాలుగేళ్ల చిన్నారితో పాటు ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం… చెన్నైకి చెందిన దంపతులు ప్రతాప్ (34), సింధూర (32), కుమార్తె ఆద్య (4), ప్రతాప్ తల్లి రాజతి తార్నాకలో ఉంటున్నారు. ప్రతాప్ చెన్నైలోని బిఎండబ్లూ కార్ల షోరూమ్‌లో డిజైనర్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, సింధూర హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. గత కొంతకాలం నుంచి కుటుంబం చెన్నైకి మారాలని ప్రతాప్ కోరుతున్నాడు. ఈ విషయమై సింధూరకు ప్రతాప్‌కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతికి హైదరాబాద్‌కు వచ్చిన ప్రతాప్ ఆదివారం రాత్రి కుటుంబం మొత్తం చెన్నైకి షిఫ్ట్ కావాలని సింధూరతో వాగ్వాదానికి దిగాడు. దీనికి సింధూర నిరాకరించడంతో ఆవేశంలో ప్రతాప్ హత్య చేశాడు.

తర్వాత కూతురు ఆద్య కూడా హత్య చేయగా సోమవారం తెల్లవారుజామున తన తల్లి రాజతిని చంపి ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి చుట్టుపక్కల వారు రెండు రోజుల నుంచి సింధూర కుటుంబం తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ముగ్గురు మృతి చెంది ఉండగా, ప్రతాప్ ఉరివేసుకుని ఉన్నాడు. సంఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెంది ఉండగా ప్రతాప్ మాత్రమే ఉరివేసుకుని ఉండటంతో కుటుంబ సభ్యులను చంపిన తరువాత ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News