Sunday, January 19, 2025

బ్రతుకుదెరువు కోసం వచ్చి అగ్నికి ఆహుతి

- Advertisement -
- Advertisement -

మద్దిరాల: హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయిన సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ..సూర్యపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రేట్నేని జెన్నయ్య, భద్రయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు రేట్నేని నరేష్ (36) తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సుమ (30) వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సాత్విక్(7), జస్విత్ (5) నరేష్ తల్లి భద్రమ్మ గత కొద్ది సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధితో బాధ పడుతుంది.తల్లి దండ్రులను పోషించుకోవడం కోసం తన భార్య పిల్లలతో హైద్రాబాద్‌కు వలస వచ్చి ఒక ప్రైవేట్ వాహనం డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పని ముగించుకుని శనివారం రాత్రి  సుమారు 2 గంటలకు కుషాయిగూడలోని  రూం కి వెళ్లి పడుకున్నాడు.

కాగా ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో తాను ఉంటున్న అద్దె ఇంటి పక్కన ఉన్న టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి తాను ఉంటున్న ఇంటికి మంటలు అలుముకోవడంతో మంటల నుండి తాను ,తన భార్య సుమ,చిన్న కుమారుడు జశ్విత్‌ను రక్షించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం చేసినప్పటికి అప్పటికే మంటలు ఎక్కువ కావడంతో మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందారు. నరేష్ పెద్ద కుమారుడు సాత్విక్ తన మేనత్త ఇంటికి వెళ్ళడంతో అతను బ్రతికాడు. ఇది ఇలా ఉండగా ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటిని పోషించే కుమారుడు , కోడలు , ముక్కు పచ్చలారని మనవడు అగ్నికి ఆహుతి కావడంతో ఆ వృద్ధ తల్లిదండ్రుల దుఖం ఆపడం ఎవరి తరం కావడం లేదు. అనాథగా మారిన పెద్ద కుమారుడు సాత్విక్ అమ్మ, నాన్నలు కావాలని ఏడవడంతో వచ్చిన బంధువులు , గ్రామస్తులు దుఖః సముద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News