గత 46 ఏళ్లుగా మూతపడిన సంభల్(యూపి)లోని భస్మ శంకర్ మందిరంను గత వారమే తెరిచారు. కాగా ఆ మందిరంకు సంబంధించిన మూడు దేవతా విగ్రహాలు ధ్వంసం అయిన స్థితిలో మందిరం బావిలో లభించాయని అధికారులు సోమవారం తెలిపారు. శ్రీ కార్తీక్ మహాదేవ్ మందిరం(భస్మ శంకర్ మందిరం)ను డిసెంబర్ 13న తెరిచాక వారు మందిరం కట్టడంపై దృష్టి సారించారు. హనుమంతుడు, శివలింగం కొలువుడే ఆ మందిరాన్ని 1978 నుంచి మూసి ఉంచారు.ఆ మందిరం, దాని బావి వద్ద తవ్వకాలు జరిపినట్లు సంభల్ జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా విలేకరులకు తెలిపారు. ‘దాదాపు 10 నుంచి 12 అడుగుల మేరకు తవ్వకాలు జరిపాం. ఈ సందర్భంగా నేడు మొదట ధ్వంసం అయిన పార్వతి దేవి విగ్రహం, తర్వాత ధ్వంసమైన గణేశుడు, లక్ష్మీ విగ్రహాలు లభించాయి’అన్నారు. ‘విగ్రహాలను ధ్వంసం చేసి బావిలో పడేశారా?’ అని ప్రశ్నించినప్పుడు, ‘అదంతా పరిశోధన తర్వాత తెలుస్తుంది’ అని ఆయన జవాబిచ్చారు.
‘ప్రస్తుతానికైతే ఈ విగ్రహాలు బయటపడ్డాయి. అవి బావిలోకి ఎలా వెళ్లాయి?ఏమి జరిగింది, ఏమి జరగలేదు…వంటి విషయాలు సమగ్ర దర్యాప్తులో తెలియగలదు’ అని రాజేందర్ పెన్సియా తెలిపారు. కాగా గుడి చుట్టు పక్కల ఆక్రమణల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ‘కొందరు తమ ఆక్రమణలను స్వయంగా నిర్మూలించారు. మరికొందరిని తమ ఆక్రమణలను తొలగించాలని కోరడం జరిగింది. చేపట్టాల్సిన చర్యలు కొనసాగుతాయి, తర్వాత నగర పాలిక వాటిని కూడా తొలగించేయగలదు’ అన్నారు. ‘మందిరాన్ని సుందరీకరిస్తారా?’ అని అడిగిన ప్రశ్నకు ‘మొదట మందిరం ఎంత ప్రాచీనమైనదో నిర్ధారణ కానివ్వండి’అని జవాబిచ్చారు.తవ్వకాల ప్రదేశంలో ఉన్న సంజీవ్ శర్మ ‘బావిలో లక్ష్మీ, పార్వతి విగ్రహాలు ధ్వంసం అయిన స్థితిలో లభించాయి’ అన్నారు. కాగా పార్వతి విగ్రహం దాదాపు 10 నుంచి 20 అడుగుల లోతులో బావిలో లభించాయని అన్నారు.
ఇదిలావుండగా విగ్రహాలు లభించిన విషయం తనకు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసరు(ఎస్‌హెచ్‌ఓ) ద్వారా తెలిసిందని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ వందనా మిశ్రా పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.భస్మ శంకర మందిరం ఖగ్గు సరాయ్ ప్రాంతంలో షాహి జామా మస్జిదుకు కేవలం కొన్ని కిలో మీటర్ల దూరంలోనే ఉంది. ఆ మస్జిదు వద్ద నవంబర్ 24న సర్వేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. అప్పుడు నలుగురు మరణించారు, పోలీసులు సహా అనేక మందికి గాయాలయ్యాయి. మందిరం ఎంత పురాతమైనదో…బావి సహా నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ టెస్ట్ జరపాలని జిల్లా పాలకవర్గం భారత పురావస్తు సర్వే శాఖకు లేఖ రాసింది. ఇదిలావుండగా సంభల్ జిల్లా బిజెపి చీఫ్ చౌదరి హరేంద్ర సింగ్ ఆదివారం సాయంత్రం ఆ మందిరంలో పూజలు నిర్వహించారు. సంభల్‌కు చెందిన హిందువులు ఎప్పుడు, ఎలా అక్కడి నుంచి వెళ్లిపోయారన్నది తేలాల్సి ఉందని ఆయన అన్నారు.
‘ఇక్కడ మందిరం ఉన్నప్పుడు హిందువులు కూడా ఉండాలి. అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితిలో వారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టారన్నది తేలాలి. వారెందుకు అక్కడి నుంచి వలసపోయారన్నది తెలియాలి. ఇదంతా ప్రజలకు తెలియాలి’ అని ఆయన అన్నారు. కశ్మీర్ నుంచి హిందువులు వలసపోయారన్నది తెలుసు, కానీ సంభల్ నుంచి హిందువులు ఎందుకు వలసపోయారన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జిల్లా పాలకవర్గం నిష్పక్షపాతంగా పనిచేస్తున్నందుకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గుడి చుట్టుపక్కల ఆక్రమణలను పాలకవర్గం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.