Monday, January 20, 2025

నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఒట్టావా : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ కెనడా పోలీస్‌లు ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. ఎడ్మంటన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కరణ్ ప్రీత్ సింగ్ (28), కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22)లను అదుపు లోకి తీసుకున్నారు. ఈమేరకు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్‌లు అధికారిక ప్రకటన చేస్తూ వారి ఫోటోలను విడుదల చేశారు. వీరిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపినట్టు వెల్లడించారు. “ఈ ముగ్గురు హిట్ స్కాడ్ సభ్యులు.

ఈ ముఠాపై అధికారులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. దర్యాప్తు ఇక్కడితో ముగియలేదు. ఈ హత్య ఘటనలో మరింత మంది ప్రమేయం ఉన్నట్టు మాకు తెలిసింది. ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నాం. నిందితులందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తాం” అని కెనడా పోలీస్‌లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితులు ముగ్గురికీ పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్లమీడియా కథనాలు వెల్లడించాయి.“ కొంతమంది గ్యాంగ్‌స్టర్లు కెనడాలో కూర్చుని భారత్‌లో తమ నేర కార్యకలాపాలు సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్ ఐఎస్‌ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి.

దీని గురించి మేం చాలాసార్లు అనేక ఆధారాలు ఇచ్చినా, కెనడా ప్రభుత్వం గానీ, పోలీస్‌ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది. అరెస్టయిన ఆ ముగ్గురు డ్రగ్స్ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయని మాకు తెలిసింది” అని సదరు వర్గాలు మీడియాకు వివరించాయి. 2023 జులై 18న బ్రిటిష్ కొలంబియా లోని సర్రే ప్రాంతంలో గురుద్వారా వెలుపల నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు భగ్గు మన్నాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. మరోవైపు నిజ్జర్ హత్య దృశ్యాలు ఇటీవల కెనడా మీడియాలో వైరల్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News