మన తెలంగాణ/హైదరాబాద్: ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులపై ఎపి ప్రభుత్వం వేటు వేసింది. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసులో ఇం టెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా, ఐపిఎస్ అధికారి విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు వే సింది. ఈ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తాజాగా సంతకం చేశారు. ఈ మేరకు జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు. డిజిపి నివేదిక ఆ ధారంగా ముగ్గురు ఐపిఎస్‌లపై వేటు వేశారు. కాగా, ఈ వ్యవహారానికి సం బంధించి విజయవాడలో పనిచేసిన అప్పటి ఎసిపి హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణను డిజిపి సస్పెండ్ చేశారు. ఎసిపి హనుమంతరావు జత్వానీ కేసు అనంతరం కాకినాడ డిఎస్‌పిగా బదిలీ అయ్యారు.
అయితే ఆమె పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో హనుమంతరావు మళ్లీ విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్‌లో కీలకంగా వ్యవహరించారు. అలాగే కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సిఐ సత్యనారాయణ అసలు కేసు వివరాలను పరిశీలించకుండానే ఉన్నతాధి కారుల ఆదేశాలతో కేసు నమోదు చేసి నటిని అరెస్టు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వేటుకు గురైన ముగ్గురు ఐపిఎస్‌లపై ముంబై నటి వ్యవహారంతో పాటు పలు అభియోగాలున్నాయి. తప్పుడు కేసులో ముంబై నటి జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో కీలకపాత్రధారులని చెబుతున్న నాటి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా, డిసిపి విశాల్ గున్నీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐపిఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డిజిపి ద్వారకా తిరుమల రావు విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో జత్వానీ, ఆమె కుటుంబసభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు.
కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై నివేది కను రూపొందించి డిజిపికి అందజేశారు. కాగా వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యా యంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబ యి వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేసి తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని జత్వానీ కోరిన విషయం విదితమే. అక్రమ నిర్బంధం, వేధింపులపై కాదంబరి జత్వానీ ఎపి పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గు రు ఐపిఎస్ అధికారులపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలిసింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్‌ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో తనను అక్రమంగా నిర్వంధించారని, తన పూర్వాపరాలను, ముంబయిలో తన నివాసం, తదితర అంశాలను విశాల్ గున్నీ ద్వారా ఆరా తీయించారని జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఒకేసారి ముగ్గురు ఐపిఎస్ అధికారులను సస్పెండ్ చేసి ఎపి సర్కార్ సంచలనం సృష్టించింది.
మిగతా ఐపిఎస్‌లలో గుబులు..?
గత వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా ఐపిఎస్ అధికారులు కాంతి రాజా టాటా, పిఎస్‌ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ వ్యవహరించారని పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సిఎం చంద్రబాబు తీవ్రంగా స్పందిం చారు. ఆడపిల్లకు న్యాయం చేయాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే కేసులో ఇటీవల ఇద్దరు కింది స్థాయి అధికారులను డిజిపి సస్పెండ్ చేయగా, ఇప్పుడు పెద్ద తలకాయలపై వేటు పడడంతో పోలీసు వర్గాల్లో కలకలం ఏర్పడింది. కాదంబరి జత్వానీ అంశంలో డిజిపి నివేదిక ఆధారంగా సిఎం చంద్రబాబు సస్పెండ్‌కు నిర్ణయం తీసు కున్నారు. ఈ ముగ్గురు ఐపిఎస్ అధికారులు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని వార్తలు గుప్పుమన్నాయి. వీరితోపాటు చాలా మంది అధికారులపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయ. పోలీసుల అధికారులపై వేటుతో ఐఎఎస్ అధికారుల్లోను గుబులు ఏర్పడింది.