శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ ముస్లిం డెమోక్రాటిక్ లీగ్, కాశ్మీర్ ఫ్రీడమ్ ఫ్రంట్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ (హెచ్‌సి) నుంచి తప్పుకున్నాయని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఇంత వరకు జమ్మూ కాశ్మీర్‌లో అటువంటి 11 సంస్థలు వేర్పాటువాదానికి స్వస్తి పలికాయి. వాటి చర్య రాజ్యాంగంలో ప్రజల విశ్వాసాన్ని ప్రదర్శించిందని అమిత్ షాస్పష్టం చేశారు. ‘మరి మూడు సంస్థలు, జమ్మూ కాశ్మీర్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ ముస్లిం డెమోక్రాటిక్ లీగ్, కాశ్మీర్ ఫ్రీడమ్ ఫ్రంట్ హురియత్‌తో సంబంధం లేదని స్వయంగా ప్రకటించాయి. లోయలో భారత రాజ్యాంగం పట్ల ప్రజల విశ్వాసానికి అది ప్రధాన సూచిక’ అని అమిత్ షా ‘ఎక్స్’లో రాశారు. జమ్మూ కాశ్మీర్‌లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పర్యటన మధ్యలో ఈ ప్రకటన వెలువడింది.
సమైక్య, శక్తిమంత భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ లక్షానికి ఇప్పుడు మరింత బలం చేకూరిందని, ఇంత వరకు అటువంటి 11 సంస్థలు వేర్పాటువాదానికి స్వస్తి పలికి, మోడీ లక్ష్యానికి తిరుగులేని మద్దతు ప్రకటించాయని అమిత్ షా తెలియజేశారు. క్రితం నెల వేర్పాటువాదుల బృహత్ కూటమి హురియత్ కాన్ఫరెన్స్ నుంచి పలు సంస్థలు తప్పుకున్నాయి. హురియత్‌తో ఇక సంబంధం లేదని ప్రకటించిన సంస్థల్లో షహీద్ సలీమ్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్, న్యాయవాది షఫీ రెషి నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ డెమోక్రాటిక్ పొలిటికల్ మూవ్‌మెంట్, మొహ్మద్ షరీఫ్ సర్తాజ్ నాయకత్వంలోని జమ్మూ కాశ్మీర్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఉన్నాయి.
మార్చి 25ప ఆ సంస్థలు ఆ ప్రకటన చేసినప్పుడు మోడీ ప్రభుత్వ ఏకీకరణ విధానాలు జమ్మూ కాశ్మీర్ నుంచి వేర్పాటువాదాన్ని ‘దూరం చేశాయి’ అని అమిత్ షా చెప్పారు. రెండు రోజుల తరువాత మరి రెండు హురియత్ భాగస్వామ్య సంస్థలు జమ్మూ కాశ్మీర్ తెహ్రీకీ ఇస్తెక్‌లాల్, జమ్మూ కాశ్మీర్ తెహ్రీకీ ఇస్తికామత్ హురియత్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. జమ్మూ కాశ్మీర్ తెహ్రీకీ ఇస్తెక్‌లాల్‌కు గులామ్ నబీ నాయకత్వం వహిస్తుండగా జెకె తెహ్రీకీ ఇస్తికామత్‌కు గులామ్ నబీ వర్ నేతృత్వం వహిస్తున్నారు.