బళ్లారి: వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో తాలూకాలోని కనగల్లు గ్రామ సమీపంలోని హెచ్‌ఎల్‌సీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం నుంచి ఐదుగురు వ్యక్తులు సురక్షింతంగా బయటపడ్డారు. కృష్ణానగర్ క్యాంప్ సమీపంలో హెచ్‌ఎల్‌సీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదసమయంలో ఆటోలో 11 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. మృతులను బళ్లారి తాలుకా కొలగల్లు గ్రామానికి చెందిన నింగమ్మ, దురుగమ్మ, పుష్పావతిగా గుర్తించారు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే నింగమ్మ, దురుగమ్మ, పుష్పవతి, కుడతిని హులిగెమ్మ, లక్ష్మి, నాగరత్నమ్మ, ఈడిగర భీమా, దమ్మూరి ఎర్రమ్మ, హేమావతి, శిల్ప, మహేష్ అనే పది మంది వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్లారు. పక్కనే ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ కుడికాలువపై ఉన్న అప్పర్ లెవల్ కాల్వపై ఆటో వెళ్తుండగా ముందు చక్రానికి రాయి తగిలి ఆటో కాల్వలో పడిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.