Wednesday, January 22, 2025

రైల్వే సిగ్నల్ సిబ్బందిపై రైలు దూసుకెళ్లి ముగ్గురి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ముంబై : సిగ్నల్ సిస్టమ్ మరమ్మతు చేస్తున్న సమయంలో లోకల్ రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పాల్ఘర్ జిల్లా వసాయి పట్టణం సమీపాన వసాయి రోడ్, నయిగావ్ స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి 8.55 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని రైల్వే అధికారులు మంగళవారం వెల్లడించారు. దక్షిణ ముంబై లోని చర్చిగేట్ టెర్మినల్ పాయింట్‌కు లోకల్ రైలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులు చీఫ్ సిగ్నలింగ్ ఇన్‌స్పెక్టర్ వాసు మిత్ర, ఎలక్ట్రికల్ సిగ్నలింగ్ మెంటైనర్ సోమనాథ్ ఉత్తం లంబూత్రే, వసాయి రోడ్ అండ్ హెల్పర్ సచిన్ వాంఖడే గా గుర్తించారు. వీరంతా పశ్చిమరైల్వే ముంబై డివిజన్ సిగ్నలింగ్ విభాగం ఉద్యోగులు. ఈ సంఘటనపై దర్యాప్తుకు పశ్చిమ రైల్వే అధికారులు ఆదేశించారు. పశ్చిమరైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ ( డిఆర్‌ఎం) , ఇతర సీనియర్ రైల్వే అధికారులు సంఘటన ప్రదేశానికి వెళ్లి ఆయా కుటుంబీకులకు సహాయ కార్యక్రమాలు అందించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రైల్వే పోలీస్‌లు కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.55,000 వంతున తక్షణ సహాయం అందించారు. 15 రోజుల్లో మిగతా ఎక్స్ గ్రేషియా, ఇతర చెల్లింపులు అందజేస్తామని ఆయా కుటుంబాలకు చెప్పారు. మృతులకు రావలసిన బకాయిలకు సంబంధించి లంబూత్రే, వాంఖెడే కుటుంబాలకు రూ.40 లక్షలు వంతున, మిత్రా కుటుంబానికి రూ.1.24 కోట్లు వంతున అందుతుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News