ధంతరి (చత్తీస్‌గఢ్) : చత్తీస్‌గఢ్ ధంతరి జిల్లా లో శనివారం వేర్వేరు సంఘటనల్లో ఏనుగుల దాడికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రాయిపూర్‌కు 150 కిమీ దూరంలో ఉదంతిసీతానది టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో ఈ సంఘటనలు జరిగాయి. శనివారం పైక్‌భట గ్రామానికి చెందిన 38 ఏళ్ల భూమిక మార్కం మరో ఆమెతో కలిసి వంటచెరకు కట్టెల కోసం అడవిలోకి వెళ్లగా ఏనుగు దాడి చేసింది. భూమిక మార్కం చనిపోగా ఆమెతో వెళ్లిన మరో ఆమె తప్పించుకుని స్థానికులకు తెలియజేసింది. కొందరు ఆ ప్రదేశానికి వెళ్లి వెతకగా భూమిక మృతదేహం లభ్యమైంది.
అదే ప్రదేశానికి సమీపాన 45 ఏళ్ల బుధం నేతం అనే వ్యక్తి శవాన్ని అటవీ అధికారులు కనుగొన్నారు. ఈయన కూడా అదే ఏనుగు దాడి వల్ల మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. మరోసంఘటనల బెర్నసిలి గ్రామానికి చెందిన 24 ఏళ్ల సుఖ్‌బాయి శనివారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకోడానికి అడవి లోకి వెళ్లగా ఏనుగు దాడికి బలైపోయింది. ఈ మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. 25 వేలు వంతున అటవీ అధికారులు అందించారు. అన్ని లాంఛనాలు పూర్తయిన తరువాత ఒక్కో కుటుంబానికి రూ. 5.75 లక్షలు పరిహారం అందిస్తారు.