Friday, November 22, 2024

మణిపూర్‌లో తిరిగి చెలరేగిన తెగల ఘర్షణలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్ శుక్రవారం తిరిగి హింసాత్మక ఘటనలతో రగిలింది. తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు, పరస్పర కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్రంలో మే 3 వ తేదీ నుంచి తెగల మధ్య సంకుల సమరం పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల యధేచ్ఛగా మారణాయుధాల వాడకం జరుగుతోంది. కాగా ఉక్రూల్ జిల్లాలోని కుకీ తోవాయ్ గ్రామంలో ఇరు వర్గాల మధ్య భీకర స్థాయిలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. తరువాత ఈ ప్రాంతంలో ఒళ్లంతా ఛిద్రమై పడి ఉన్న ముగ్గురు యువకుల భౌతికకాయాలు లభ్యం అయ్యాయి. ఇక్కడ ఓ కొండ ప్రాంతంపై నుంచి సాయుధ మూకలు కిందికి కాల్పులు జరిపాయి, దీనిని కింద ఉన్న మరో వర్గం తుపాకులతో ప్రతిఘటించింది. తంగ్‌కుల్ నాగాలు ,కుకీలుఎక్కువగా ఉండే ఈ గ్రామంలో ఘర్షణలు జరగడం ఇదే తొలిసారి.

లిటాన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో నెలకొని ఉన్న శాంతియుతమైన వాతావరణం ఇప్పటి పరస్పర ఘర్షణలతో చెదిరిపోయింది. చాలా సేపటి వరకూ ఈ ప్రాంతంలో పరస్పర ఘర్షణల అరుపులు, కాల్పుల మోతలు విన్పించాయి. కాగా ఇప్పుడు కనుగొన్న మృతదేహాలు 24 నుంచి 35 ఏండ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. పరస్పర కాల్పుల తరువాత ఈ ప్రాంతానికి తరలివచ్చిన పోలీసు బృందాలు సమీప గ్రామాలలో, అక్కడి అడవులలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో దారుణ స్థితిలో పడి ఉన్న శవాలను గుర్తించారు. వీరి మృతదేహాలపై పలుచోట్ల పదునైన కత్తిపోట్లు, వారి చేతులు కత్తిరించి ఉండటం వంటి స్థితిని గుర్తించారు. రాష్ట్రంలో మైతీ వర్గాలకు ఎస్‌టి హోదా కల్పించే ప్రతిపాదన వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది.

రాష్ట్రంలో మైతీలు 53 శాతం వరకూ ఎక్కువగా ఇంఫాల్ లోయ ప్రాంతంలో ఉంటారు. కాగా ఆదివాసీలు అయిన నాగాలు, కుకీలు కలిపి 40 శాతానికి పైగా ఉంటారు. వీరు ఎక్కువగా కొండ ప్రాంతపు జిల్లాల్లో జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఎస్‌టి హోదా అంశం ఇప్పుడు మైతీలు మరో వైపు కుకీలు నాగాల మధ్య చిచ్చుకు దారితీసింది. మనిషికి మనిషికి మధ్య తెగని వైరానికి దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News