వరంగల్: వర్షానికి గోడలు నానడంతో దాని పక్కనే నిల్చున్న వ్యక్తులపై పడటంతో ముగ్గురు మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… శుక్రవారం ఉదయం శాయంపేట మండల కేంద్రంలోని పోచమ్మదేవాలయ కాలనీలో ఒక పాతఇంటి సమీపంలో కొందరు మాట్లాడుకుంటున్న సమయంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు నానిన పెంకుటిల్లు గోడ అకస్మాత్తుగా కూలింది. దీంతో గోడను ఆనుకొని ఉన్న వ్యక్తులపై పడటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
మృతి చెందిన వారిలో శాయంపేట మండల కేంద్రానికి మోర పెద్ద సాంబయ్య, లోకపోయిన సారలక్ష్మి, బోగి జోగమ్మలు ఉన్నారు. కళ్లముందే గోడకూలి ముగ్గురు మృత్యువాత పడటం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వారితో పాటు మాట్లాడుతున్న మరో మహిళలు ఆ ప్రమాదం నుండి బయటపడింది. విషయం తెలుసుకున్న వెంటనే వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్, భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఓదార్చారు. వారికి ఆర్థిక సహాయం చేసి మృతి చెందిన ముగ్గురు కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు.