Tuesday, November 5, 2024

అయోధ్యలో మూడు లక్షల మందికి రామదర్శన భాగ్యం

- Advertisement -
- Advertisement -

అయోధ్య/లక్నో: అయోధ్యలో కొత్తగా ఆవిష్కరించిన రామాలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. బుధవారం ఉదయం చలిగాలులు ముసురుతున్నా లెక్క చేయకుండా వెచ్చని దుస్తులు ధరించి రామదర్శనం కోసం వేలాది మంది బారులు తీరారు. మధ్యాహ్నం కాగానే భక్తుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య భక్తులు రామ్‌లల్లాకు భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పించుకున్నారు. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కాగానే మంగళవారం ప్రజల దర్శనార్ధం తలుపులు తెరిచారు.

ఒక్క రోజునే ఐదు లక్షల మంది విచ్చేశారు. జన ప్రవాహం అధికం కావడంతో రద్దీని అదుపు చేయడానికి, దర్శనం సులువుగా లభించడానికి వీలుగా తగిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులతో బుధవారం లక్నోలో సమీక్ష జరిపారు. విఐపిలు , వివిధ ప్రముఖులు ముందుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు లేదా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు తెలియజేసి తమ షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని సూచించారు. అయోధ్యకు అదనంగా వచ్చే బస్సులను ఆపాలని, భక్తులకు భద్రత, వెసులుబాటు కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు.

భారీ సంఖ్యలో వచ్చిన వారిని గుర్తించిన ఒకచోట ఉంచి, అక్కడ నుంచి క్రమంగా దర్శనానికి పంపాలని సూచించారు. యాత్రికులు రామపథ్, ధర్మపథ్, జన్మభూమి పథ్, వద్ద బారులు తీరి నిలుచోవాలని, క్రమంగా వారిని ఆలయం లోకి దర్శనానికి పంపిస్తారని సిఎం సూచించారు. ఆ ప్రాంతాల్లో క్యూలో వయోవృద్ధులు, మహిళలు, చిన్నారులను ప్రత్యేకంగా గుర్తించడమౌతుందని, వృద్ధులకు, దివ్యాంగుకలకు వీల్‌చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సంప్రదాయాలకు అనుగుణంగా ప్రధాన రహదారుల్లో తక్కువ శబ్దంతో రామభజనలు వినిపించడమౌతుందని తెలిపారు.

భద్రతా సిబ్బంది ప్రవర్తన గౌరవ ప్రదంగా ఉండాలన్నారు. వివిధ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని, చలికి తట్టుకోడానికి అక్కడక్కడ భోగీ మంటలు, జనపనార చాపలు ఏర్పాటు చేయాలన్నారు. రిపబ్లిక్ డే నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం కల్పించరాదని, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, ద్వేషపూరిత విధానాలకు ప్రయత్నించినా కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ఏ ఒక్కరి మతపరమైన అభిప్రాయాలకు, ఆచారాలకు భంగం కలగరాదని, గౌరవించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News