ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మౌలాలీలో మాస్ ఫౌండేషన్ ఎన్‌జివొ పేరుతో ఆక్సిజన్ సిలిండర్‌లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మంగళవారం నాడు మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఓమ్నీ వ్యాన్ లో ఆక్సిజన్ సిలిండర్లు అక్రమ రవాణా అవుతున్నాయని సమాచారం అందుకున్న మల్కాజ్ గిరి పోలీసు స్టేషన్ ఎస్సై తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈక్రమంలో సోమవారం రాత్రి పోలీసు స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపడుతున్న సమయంలో మౌలాలీ నుంచి ఇసిఐఎల్ ప్రాంతం వైపు వెళుతున్న ఓమ్నీ వ్యానులో ఒక్కోటి 150 లీటర్లు సామర్ధం కలిగిన ఐదు ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించటంలో డ్రైవర్ సయీద్ అబ్దుల్లా(30), మహ్మద్ మజార్(37), జీఎం చౌనీ విఫలమయ్యారు.
దీంతో సిలిండర్లను సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు, ఓమ్నీ వ్యాను, ఐదు ఆక్సిజన్ సిలిండర్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక్కో సిలిండర్ రూ.16 వేలకు కొనుగోలు చేసి రోగులకు రూ.25 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. మాస్ ఫౌండేషన్ ఎన్‌జివొ పేరుతో సయ్యద్ అబ్దుల్, మహమ్మద్ మజార్, ఆసీఫ్‌లు అక్రమ సిలిండర్‌ల వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ ధరకు ఆక్సిజన్ సిలిండర్లను కొని ఎక్కువ మొత్తానికి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సయ్యద్ అబ్దుల్, మహమ్మద్ మజార్, ఆసీఫ్ ముగ్గురు నిందితులు ఎలాంటి అనుమతులు లేకుండా కరోనా రోగులకు ఎక్కువ ధరకు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సిలిండర్‌ని రూ. 25 వేలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఈక్రమంలో నిందితుల నుంచి 120 కిలోల ఐదు సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.