Wednesday, January 29, 2025

కువైట్ నుంచి పారిపోయి ముంబైలో తేలారు

- Advertisement -
- Advertisement -

చేపల పడవలో ముగ్గురు తమిళనాడు జాలరుల అరెస్టు
సముద్ర మార్గంలో భద్రతా లోపాలపై ఆందోళన

ముంబై: కువైట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక చేపల పడవలో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులను ముంబై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సంఘటనతో సముద్రమార్గంలోని భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం ఉదయం ముంబై సమీపంలోని సముద్ర తీరంలో ఈ పడవను గుర్తించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురిలో ఇద్దరు తమిళనాడుకు చెందిన జాలరులని, వీరు గత రెండేళ్లుగా కువైట్‌లో పనిచేస్తున్నారని తమ దర్యాప్తులో తేలినట్లు ఆ అధికారి చెప్పారు.

వారి వద్ద పాస్‌పోర్టులు లేవని ఆయన తెలిపారు. తమ ఏజెంట్ నుంచి అవమానాలు ఎదురుకావడంతో కువైట్ నుంచి తప్పించుకోవడానికి తమ యజమానికి చెందిన చేపల పడవను ఉపయోగించినట్లు వారిద్దరు చెప్పారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారని ఆయన చెప్పారు. అరెస్టయిన వారిని తమిళనాడులోని కన్యాకుమరికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినోద్ ఆంటోని, సహాయ ఆంటోని అనీష్, తమిళనాడులోని రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిడిసో డిటోగా గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా వారికి ఫిబ్రవరి 19 వరకు జుడిషియల్ రిమాండ్ విధించారు.

కాగా, ఈ సంఘటనతో సముద్రంలో భద్రతా వ్యవస్థపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2008 నవంబర్‌లో ముంబై నగరంలోకి సముద్ర మార్గం ద్వారా ప్రవేశించిన పాకిస్తానీ తీవ్రవాదులు నవంబర్ 26న దాడులు జరపగా 166 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఇలా ఉండగా మంగళవారం ఉదయం 7.30 ప్రాంతంలో అరేబియా సముద్రలో గస్తీ విధులను నిర్వహిస్తున్న ఎల్లో గేట్ పోలీసు స్టేషన్ సిబ్బందికి సూన్ డాక్ సమీపంలో అనుమానాస్పదంగా కదులుతున్న ఒక పడవ కనిపించింది.

వేరే దేశానికి చెందిన పడవగా గుర్తించిన సిబ్బంది సమీపానికి వెళ్లి చూడగా అందులో ముగ్గురు వ్యక్తులు కనిపించారు. ఆ ముగ్గురు వ్యక్తులు మరాఠీ కాని హిందీ కాని మాట్లాడలేకపోవడం, వచ్చీరాని ఇంగ్లీష్‌లో మాట్లాడడంతో వారిపైన అనుమానం పెరిగిందని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వెంటనే సౌత్ రీజియన్ కంట్రోల్ రూముకు సమాచారం అందించిన గస్తీ బృందం సహాయాన్ని కోరింది. అక్కడకు చేరుకున్న రెండు పోలీసు పడవలు, ఒక నేవీ పడవ అనుమానితులను ప్రశ్నించి, వారితోపాటు పడవను ఇండియా గేట్ వద్దకు తరలించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News