Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి లీకేజీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో సిట్ అధికారులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 99 కి చేరింది. ఈ కేసులో.. ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి, ప్రవీణ్‌కి వారు సహకరించారని అధికారులు గుర్తించారు. మరో పక్క. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఎ-2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో మరోసారి తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ మూడుసార్లు తిరస్కరణకు గురైంది. సిట్ అధికారులు నిందితుల నుంచి సేకరించిన సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లను ఫోరెన్సిక్ సైన్స్‌ల్యాబ్‌కు పంపించారు. ఆ నివేదిక రాగానే అనుబంధ అభియోగపత్రం దాఖలు చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 37మందితో సిట్ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరు నిందితుల అరెస్టులు పెరిగే అవకాశం ఉందని సిట్ అధికారుల పేర్కొన్నారు.

దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. కనీసం 150 మంది వరకూ అరెస్టవుతారని అధికారులు అంచనావేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారని దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. ఓ అభ్యర్థి రూ.30 లక్షలు చెల్లించి ఎఇ ప్రశ్నపత్రాన్ని కొన్నాడని అధికారులు గుర్తించారు. ఎఇ ప్రశ్నపత్రం అమ్మడం ద్వారానే ఓ వ్యాపారి రూ.2.5 కోట్లు వరకు వసూలు చేశాడని అధికారులు వెల్లడించారు. ఇలా అనేక మంది పెద్ద మొత్తంలో నగదు చెల్లించి టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారు. ఈ పరీక్షలు రాసిన వారిలో సుమారు రెండు శాతం మినహా మిగతావారంతా నిరుద్యోగులు. దీంతో పాటు తల్లిదండ్రులపై ఆధారపడి చదువుకున్న వారే ఎక్కువగా ఉన్నారని విచారణలో అధికారులు గుర్తించారు. అందువల్ల ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తల్లిదండ్రులను సాక్షులుగా చేర్చాలని కొంత మంది పోలీసులు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన నిందితులను జులై10న 18 మందిని, 11వ తేదీన ముగ్గురిని, 12న మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్‌లు చేశారు. కరీంనగర్‌లో తండ్రి, కూతుర్లలను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. మద్దెల శ్రీనివాస్, ఆయన కుమార్తె సాహితి ఎఇ పరీక్ష పేపర్ కోసం రమేశ్ కుమార్ సహాయం కోరాడు. రూ.30 లక్షలు ఒప్పందంతో మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్షను రాయించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో తండ్రి, కుమార్తెలను జులై 12న అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
పేపర్ లీకేజీ అంశం వెలుగులోకి వచ్చిందిలా…!
ఈ సంవత్సరం మార్చి నెలలో టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ అంశం వెలుగులోకి వచ్చింది. మొదట టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు అధికారులకు సమాచారం అందింది. విచారణ చేపట్టిన అధికారులు టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో దర్యాప్తు చేపట్టగా.. కంప్యూటర్లు హ్యాక్ కాలేదని పోలీసులు తేల్చారు. టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే పరీక్ష పేపర్ లీకైనట్లుగా గుర్తించారు. దీంతో ఈ విషయమై సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా కొన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్ కుమార్ టిఎస్‌పిఎస్‌సిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కొంత కాలం నుంచి టీచర్ గా పని చేస్తున్న రేణుక అనే ఆమెతో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే రేణుక వారి స్నేహన్ని అడ్డుపెట్టుకుని అసిస్టెంట్ ఇంజినీర్ కి సంబంధించిన ప్రశ్నాపత్రం కావాలని అడిగింది.రేణుక భర్త డాక్యా నాయక్ తో కలిసి 10 లక్షలకు డీల్ కుదుర్చుకుంది. దీంతో అతడు నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న రాజ్ శేఖర్ రెడ్డి సాయం కోరాడు. ఇద్దరూ కలిసి ప్రశ్నపత్రాలు ఉన్న కంప్యూటర్ పాస్ వర్డ్ ని కొట్టేశారు.

అయితే టిఎస్‌పిఎస్‌సిలో అన్ని కంప్యూటర్లు ఒకే ల్యాన్ కింద కనెక్ట్ అయి ఉండటంతో సర్వర్ లో పాస్ వర్డ్ టైప్ చేసి ప్రశ్న పత్రాలు తీసుకున్నారు. తరువాత వాటిని ఓ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకున్న ప్రవీణ్ రేణుకకి ఇచ్చాడు. ఆమె నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నాడు. ఆమె తన సోదరుడు రాజేశ్వర్ నాయక్, అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులతో డీల్ సెట్ చేసేందుకు సహకరించాడు. ఆ తరువాత వారు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సంప్రదించగా అతను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ తనకు తెలిసిన వారందరికీ ఈ విషయం తెలియజేసి డబ్బులు చెల్లించి పేపర్ తీసుకునేటట్లుగా డీల్ సెట్ చేసుకున్నారు. ఇలా మొత్తం రూ. 13.5 లక్షలు సేకరించారు. ఈ తతంగం మొత్తం ఎవరికీ అనుమానం రాకుండా పూర్తవడంతో ఇదే పంథాలో టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు కూడా ఇంటి దొంగలు లీక్ చేసినట్లు సమాచారం. మార్చి 11 టిఎస్‌పిఎస్‌సి నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈ విషయాలన్ని గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీక్ అయ్యాయన్న అనుమానంతో టిఎస్‌పిఎస్‌సి ఫిర్యాదు చేయగా తాము దర్యాప్తు చేశామని, ఈ క్రమంలో మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్లు కూడా లీకయ్యాయని గుర్తించామని చెప్పారు. ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నామని, గతంలో జరిగిన పరీక్షల పేపర్లేమైనా లీక్ చేశారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులు కొందరు విదేశాల్లో కూడా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News