Monday, December 23, 2024

మరో మూడు రోజులు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కర్ణాటక నుండి తెలంగాణ మీదుగా దక్షిణ చత్తీస్‌ఘడ్ వరకూ సగటు సముద్రమట్టం నుండి 1.5కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని ,దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలో ఉరుములు ,మెరుపులు వడగండ్ల వానలతోపాటు గంటకు 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతే కాకుండా రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా భారీగా తగ్గుతున్నాయి. రాగల ఐదు రోజులలో పగటి ఉష్ణోత్రలు కొన్ని చోట్ల 30డిగ్రీల కన్నా తక్కువకు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వివరించారు. వాతావరణ కేంద్రం ఇందుకు సంబంధించిన వెదర్ బులిటిన్ విడుదల చేసింది. తొలిరోజు ఆదివారం రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం ,ఖమ్మం ,నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ,వరంగల్ , హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ,ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తలిపింది.రెండవ రోజు మే ఒకటిన రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు , భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ , వరంగల్ , హన్మకొండ జిల్లాల్లో ఉరుములు ,మెరుపులు ఈదురు గాలులతో భారీ వర్షాలు , అక్కడక్కడ వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

హైదరాబాద్‌కు ప్రత్యేక వర్ష సూచన:

వాతావరణ కేంద్రం గ్రేటర్ హైదరాబాద్ , దాని పరిసర ప్రాంతాలకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక చేసింది. రానున్న 24గంటల్లో సాధారణంగా ఆకాశం మేఘావృతం అయివుంటుందని తెలిపింది. నగరంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు,బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30,కనిష్టంగా 22డిగ్రీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలిపింది.ఆగ్నేయ దిశ నుండి గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆ తరువాత 48గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

దంచి కొట్టిన వర్షం

గడిచిన 24గంటల్లో రాష్ట్రమంతటా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో దంచికొట్టింది. శనివారం తెల్లవారుజామున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అత్యధికంగా హిమాయత్ నగర్‌లో 60.8 మి.మి వర్షం కురిసింది. గోల్కొండలో 59,షేక్‌పేటలో 42.6, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 57.8,కొయిల్ కొండలో 56, కొల్లాపూర్‌లో 54.4, సంగారెడ్డిలో 45.5, భువనగిరిలో 45.2, మహేశ్వరంలో 38, ఇబ్రహీంపట్నంలో 36.2, వీపనగండ్లలో 33.3, యాదగిరిగుట్టలో 32.4, శాద్‌నగర్‌లో 32.2, నర్వలో 29.8, పాలకుర్తిలో 29.4, జుక్కల్‌లో 26.6, బాన్స్‌వాడలో 24.2 ,సంగారెడ్డిలో 22, పెబ్బేర్‌లో 20.8, దిండిగల్ లో 19.6, పెద్దమందడిలో 16మి.మి చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News