Sunday, December 22, 2024

మరో మూడు రోజలు తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

ఆగస్ట్ 3వరకూ హెచ్చరికలు లేవు
రాష్ట్రంలో 65శాతం అధిక వర్షపాతం
తెలంగాణలో అత్యధికంగా 64.9 సెం.మీ. వర్షం
రెయిన్‌ఫాల్ రికార్డుల్లో లక్ష్మీదేవిపేటకి ప్రత్యేక పేజి

హైదరాబాద్ :  రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దక్షిణ ఒడిస్సా పరిసరాల్లోని ఉత్తర అంధ్రప్రదేశ్ వద్ద ఉన్న అల్పపీడనం శుకవారం బలహీనపడింది. షియర్‌జోన్ అక్షాంశం వెంబడి సగటు సముద్రమట్టం నుండి 5.8కి.మి ఎత్తువద్ద కొనసాగుతోంది. దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదిలాబాద్, నిర్మల్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపలి,్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణకేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఆగస్ట్ మూడు వవరకూ భారీ వర్షాలు లేనట్టే అని , అంతే కాకుండా ఎటువంటి హెచ్చరిఇకలు కూడా వుండకపోవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
65శాతం అధిక వర్షపాతం
ఈ సీజన్‌కు సంబంధించి వర్షాల రాక కొంత ఆలస్యం అయినప్పటికీ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 65శాతం అధిక వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా, ఖమ్మం, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది. జులై 17 వరకూ 54శాతం లోటు వర్షపాతంలో ఉన్న తెలంగాణ వాతావరణ పరిస్థితులు నాలుగు రోజుల్లోనే మారి పోయాయి. తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా సంచలనం గొలుపుతూ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.9 సెంటీమీటర్ల వర్షం కురిసి రెయిన్‌ఫాల్ రికార్డుల్లో ప్రత్యేక పేజిని రాసిపెట్టేలా చేసింది. అంతకు ముందు 2013 జులై 19న వాజేడులో 51.75 సెంటీమీటర్ల వర్షంతో అదే అప్పటికి సరికొత్తరికార్డును సృష్టించింది. మొన్నటివరకూ ఇదే భారీ రికార్డుగా కొనసాగుతూ రాగా లక్ష్మిదేవిపేటలో కురిసిన వర్షం గత రికార్డులను దాటేసింది.
ఖానాపూర్‌లో 275.4 మి.మీ. వర్షం
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 275.4 మి.మీ. వర్షం కురిసింది. అదే జిల్లాలో నవీపేటలో 245.8 మి.మీ వర్షం కురిసింది. కైతలాపూర్‌లో 179.8, లక్ష్మణ్‌చందలో 164.8, భీమ్‌గల్‌లో 164, ముధోల్‌లో 162.2, మక్లూర్‌లో 159.4, మెట్‌పల్లిలో 147.2, మల్లాపూర్‌లో 142.4, రాంజల్‌లో 140,మోర్టాడ్‌లో 138, చందుర్తిలో 135, నందిపేట్‌లో 131, జక్రాన్‌పల్లిలో 130.4, ఆర్మూర్‌లో 129, ధర్పల్లిలో 127, వేల్పూర్‌లో 120, నిజామాబాద్‌లో 114, కమ్మర్‌పల్లిలో 112, ముస్టాబాద్‌లో 109, బోధన్‌లో 109, సారంగాపూర్‌లో 105, కోట్గిరిలో 103, వర్నిలో 103, సిరిసిల్లలో 102, రుద్రూర్‌లో 102 మి.మీ వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన 20ప్రాంతాల్లో 50నుంచి 100 మి.మీ. వరకూ వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News