Tuesday, January 21, 2025

అకాల వర్షాలతో ఆగమాగం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు . మరో చోట పిడుగుపాటుకు 20మేకలు చనిపోయాయి. రెండు గేదెలు మృతిచెందాయి. అకాల వర్షాలు , వడగండ్ల వానలతో వరి , మొక్కజొన్న ,మామిడి తదతర పంటలకు నష్టం వాటిల్లింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది.వరంగల్ జిల్లా మరిపెడ మండలంలో బావోజిగూడెం గ్రామంలో పిడుగులు పడ్డాయి . వర్షానికి ధాన్యం కుప్పలపై పట్టాలు కప్పెందుకు వెళ్లిన శ్రీనివాస్‌పై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయలపాలయ్యారు. పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామంలో ఆవుల మహేందర్ అనే వ్యక్తిపై పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామంలో విశాదం నెలకుంది. గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు ముత్యపు మల్లేశం తాటిచెట్టు ఎక్కుతుండగా చెట్టుపైన పిడుగు పడింది. ఈ ఘటనలో మల్లేశం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఇదే జిల్లాలోని మేడిపల్లి భీమారం మండలం గోవిందారంలో పిడుగు పదింది. ఈ ఘటనలో 20మేకలు మృతి చెందాయి. మల్యాల మండలం మద్దుట్ట గ్రామంలో వడగండ్లవర్షం కురిసింది. కోరుట్లలోని క్రిష్టిపేటలో పిడుగు పాటుకు నాగుల రవికి చెందిన గేద మృతి చెందింది. సిరిసిల్ల మండలం దమ్మన్నపేటలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంబాలు విరిగిపడ్డాయి. విద్యుత్ షాక్‌తో అన్నం నర్సేగౌడ్‌కు చెందిన పాడిగేదె మృతిచెందింది.మహబూబ్‌నగర్ జిల్లాలో మరిపెడ మండంలో పిడుగుపాటుకు ఒకరు మృత్యువాత పడగా, మరోముగ్గురు గాయాలపాలయ్యారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉక్కిరిబిక్కిరి చేసింది. రెండుగంటల పాటు మేఘాల గర్జనతో జనం బిక్కుబిక్కుమంటు గడిపారు. అకాల వర్షం కారణంగా పొలాల్లోనే వరి , మొక్కజొన్న తదితర పైర్లు నేలవాలయి. కాపుమీద ఉన్న పైర్లలో గింజలు నేల రాలాయి. గాలి వాన ఉధృతికి మంచి కాపుమీద ఉన్న మామిడి తోటలు వణికిపోయాయి. చెట్లమీదినుంచి మామిడికాయలు నేలరాలాయి. భారీ వర్షం కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం రాసులను ముంచెత్తింది. ఆరబెట్టిన మిరప పంట తడిసిపోయింది.

నిజామాబాద్ జిల్లాలో వెల్గనూర్ వద్ద పిడుగులు పడ్డాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లు పరిశ్రమల పైకప్పులు దెబ్బతిన్నాయి. ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా నిప్పంటుకుని లారీ బియ్యం కాలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా అకాల వర్షం , వడగండ్ల వానలు పడ్డాయి. పోలాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటలకు కూడా నష్టం వాటిల్లింది. అదిలాబాద్ జిల్లా భీంపూర్ దనోరా, అర్లి గ్రామాల్లో ఈదురుగాలు, ఉరుములు ,మెరుపులతో భారీ వర్షం కురిసింది. కరీనంగర్ ,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంబాలు ఒరిగిపోయాయి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్ ,గవర్నరుపేట ప్రాంతాల్లో కురిసిన వడగండ్లవానకు మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. వరిపైర్లు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో పలు చోట్ల పిగుడులు పడ్డాయి .అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. చౌటుప్పల్‌లో తాటిచెట్టుపై పిడుగు పడింది. నల్లగొండ ఆర్జాలబావి సమీపంలో చెట్టుపై పిడుగు పడింది. భువనగిరి ఖిల్లాపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. మునుగోడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిశాయి. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

మరో మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌నుండి ఇంటీరియర్ మహారాష్ట్ర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సముద్రమట్టానికి సగటు 0.9కిమి ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు , అక్కడక్కడ ఉరుములు , మెరుపులు ,ఈదురుగాలులు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఎండల తీవ్రత తగ్గింది. పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

రాగల ఐదు రోజులు ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గడిచిన 24గంటల్లో దుండిగల్‌లో 5.2మి.మి , హకీంపేటలో 0.2, ఖమ్మంలో 194., మహబూబ్ నగర్‌లో 27.8, నిజామాబాద్‌లో 3.1, పటాన్‌చెరులో 4.2 మి.మి చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు లోపుగానే రికార్డయ్యాయి. అదిలాబాద్‌లో 39.3, భద్రాచలంలో 39, హన్మకొండలో 37, హైదరాబాద్‌లో 37,ఖమ్మంలో 37,మహబూబ్‌నగర్‌లో 37, మెదక్‌లో 38.2, నల్లగొండలో 38, నిజామాబాద్‌లో 38.3, రామగుండంలో 38.6డిగ్రీల ఉష్ణొగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News