Monday, December 23, 2024

వర్షాకాలాన్ని తలపిస్తున్న వాతావరణం.. మరో మూడు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వాతావరణం మారిపోతోంది. గత వారం రోజులుగా వాతావరణం చల్లబడింది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు వడగండ్ల వానల హెచ్చరికలు నిత్యకృత్యం అయ్యాయి. రాష్ట్రమంతటా తేలిక పాటినుంంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. ఆదివారం పిడుగు పడి వ్యక్తి మృతి చెందాడు. వాతావరణ పరిస్థితులు వానాకాలాన్ని తలపిస్తున్నాయి. మండు వేసవిలో సెగలు చిమ్మాల్సిన ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణ ఉష్ణొగ్రతలకంటే 10డిగ్రీలు ,అంతకంటే తక్కువకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 30డిగ్రీలకంటే తక్కువకు నమోదవుతున్నాయి. గత పదేళ్లలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. నడి వేసవిలో ఈ సమయానికి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైన నమోదు కావాల్సివుండగా వాతారవణ పరిస్థితులు మరోలా వున్నాయి.ఆదివారం రాష్ట్రంలో అత్యల్పంగా అదిలాబాద్‌లో 30.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 35.2, హన్మకొండలో 33, హైదరాబాద్‌లో 32.2, ఖమ్మంలో 35.6, మహబూబ్‌నగర్‌లో 34.4, మెదక్‌లో 33, నల్లగొండలో 35.5, నిజామాబాద్‌లో 32.5, రామగుండంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న ఐదారు రోజులలో ఇవి మరింత దిగువకు పడిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మరో మూడు రోజులు వర్షాలే.. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ

తూర్పు విదర్భ నుండి తెలంగాణ , ఇంటిరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టం 1.5కిలోమీటర్ల ఎత్తువద్ద ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు , మెరుపులు ,గంటకు 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రానున్న 24గంటల్లో పలు అదిలాబాద్ కొమరంభీమ్ ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్,నిజమాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ,నల్లగొండ , సూర్యాపేట , మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ , వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ , జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలోని చాల జిల్లాల్లాలో ఉరుములు , మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తరువాత నాలుగు రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఎల్లో అలర్ట్ హెచ్చరిక కూడా ఐదు రోజులపాటు కొనసాగుతుందని తెలిపింది.

పిడుగు పాటుకు వ్యక్తిమృతి.. పలు జిల్లాల్లో వడగండ్లవాన

రాష్ట్రమంతటా ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వ్యక్తి పడిగుపడి మృతి చెందాడు. సాయంత్రం గొర్రెలు మేపుతుండగా పిడుగు పడింది.గొర్రెలకాపరి పెద్దసైదులు మృతి చెందాడు . మూడు గొర్రెలు కూడా చనిపోయాయి. నిజామబాద్ జిల్లా సిరికొండ మండలంలో మధ్యాహ్నం భారీగా వడగండ్ల వానపడింది. ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. సిద్దిపేట జిల్లా కొండపాక ,కుకునూరు పల్లి మండలాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. నారాయణఖేడ్‌లో భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా ముఉగోడు మండలంలో భారీ వర్షం పడింది.

గడిచిన 24గంటల్లో మహబూబాబాద్ జిల్లాలోని గుడుర్గల్‌లో 68 మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. టేకులపల్లిఓ 55, అదిలాబాద్‌లో 48.2, తలమడుగులో 39.2, తామ్సిలో 35, నిర్మల్‌లో 34.6, కొండపాకలో 32.4, కోట్‌గిరిలో 32, ఆత్మకూరులో 28.2, జనగాంలో 24, ఇటిక్యాల్‌లో 23.6, సారంగపూర్‌లో 23.2, పినపాకలో 22.4, భీమదేవరపల్లిలో 21.4, మానోపాడ్‌లో 18.8, కొత్తగూడలో 15.2, తిరుమలగిరిలో 13, ఖానాపూర్‌లో 12.2, మల్లాపూర్‌లో 11.4, పాలకుర్తిలో 10.8 మి.మి చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒకమోస్తరు జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News