Wednesday, January 22, 2025

ఆగని వానలు.. ఆందోళనలో రైతాంగం.. మరో మూడు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వర్షాలు ఆగటం లేదు. పదిరోజులుగా నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగండ్ల వానలు, బలమైన ఈదురు గాలులతో యాసంగి పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. నోటికాడికొచ్చిన పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడిపోతున్నారు. గడిచిన 24గంటల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయేందుకు సిద్దం చేస్తున్న ధాన్యం కూడా వర్షపు నీటిలో తడిసిపోయింది. గాలి వాన ధాటికి మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. నిజామాబాబ్ ,మెదక్ , నల్లగొండ తదితర జిల్లాల్లో రైతులు అందోళన బాట పడుతున్నారు.

మెదక్ జిల్లా శివంపేట, వెల్దుర్తి ,నర్సాపూర్ తదితర మండలాల్లో గాలివాన తీవ్రతకు కల్లాలలో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం వ్యవసాయమార్కెట్ లో ధాన్యం కొనుగోళ్లు మందగించాయని ,రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిముద్దయిందని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో రాత్రి కురిసిన భారీవర్షానికి పండ్లతోటలు దెబ్బతిన్నాయి. కరీనగర్ జిల్లాలో కురిసిన భారీవర్షానికి వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ,గొల్లపల్లి ,గడపల్లి,ధార్మారం బుగ్గారం, వెలగటూరు తదితర మండలాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితిలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయి.

ఆత్మకూరులో 82 మి.మి వర్షం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒకమోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా వనపర్తి జిల్లాలోని ఆత్మకూరులో 82.4మి.మి వర్షం కురిసింది. పెబ్బేరులో 66, వీపనగండ్లలో 57, కామారెడ్డిలో 55.4, నవీపేటలో 51, గాంధారిలో 50.4, బోధ్‌లో 49.4, మల్కనూరులో 42, ఎల్లారెడ్డిలో 38.6, హిమయత్ నగర్‌లో 38.4, నారాయణఖేడ్‌లో 35.8, డిచ్‌పల్లిలో 35.6, బాల్కొండలో 32.2, దోమకొండలో 28.4 , నిజామబాద్‌లో 25, మెదక్‌లో 23.6, పాపన్నపేటలో 22.4, కొత్తకోటలో 17మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో కూడా తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురిశాయి.

మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నయే మధ్యప్రదేశ్ నుండి మరఠ్వాడ ఇంటిరియర్ కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం 0.9కి.మి ఎత్తువరకూ ద్రోణి కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాగల మూడు రోజులు ఉరుములు ,మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News