Monday, January 20, 2025

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

Three more days of rain in Telangana

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
తమిళనాడు, ఆంధ్రా సరిహద్దుల్లో భారీ వర్షాలు
తెలంగాణలోనూ మరో మూడు రోజులు వర్షాలే
ఆకాశం మేఘావృతం ముసురేసిన వాతావరణం

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో వైపు ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. చెన్నై నగరంలో గత 72ఏళ్లలో ఇంతటి వర్షం కురవడం ఇది మూడోసారి అని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. భారీ వర్షాల నేపధ్యంలో ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలు , రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా రానున్న ఐదు రోజులపాటు తమిళనాడు పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. భారీవర్షాల కారణంగా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

తెలంగాణపై ముసుగు తొడిగిన ముసురు

తెలంగాణ రాష్ట్రంపై ముసురు ముసుగేసింది. మంగళవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతంగా మారింది. ఉన్నట్టుండి రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుముఖం పట్టాయి. మధ్యాహ్నం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. హైదరాబాద్‌లో 4మి.మి వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల ఈనెల 4వరకూ ఆకాశం మేఘావృతంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాయంత్రం , రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కనిష్టంగా 17నుంచి 19డిగ్రీలు, గరిష్టంగా 28నుండి 30డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

అదిలాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖ పట్టాయి.మంగళవారం అదిలాబాద్‌లో అత్యల్పంగా 14.2డిగ్రీలు, మెదక్‌లో 14.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలంలో 23.5డిగ్రీలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దుండింగల్‌లో 18.4 , హకీంపేటలో 17.4,హనుమకొండలో 19, హైదరాబాద్‌లో 18.1, ఖమ్మంలో 22, మహబూబ్ నగర్‌లో 20.5,నల్లగొండలో 19.4, నిజామాబాద్‌లో 16.9, రామగుండంలో 17.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News