Monday, December 23, 2024

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్..ముగ్గురు నక్సల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవులలో గాలింపు చర్యలలో ఉన్న భద్రతా బలగాలు, మావోయిస్టుల నడుమ కాల్పులు జరిగిన విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒక్కరు తెలిపారు. తెలంగాణకు చెందిన అత్యంత కీలకమైన యాంటీనక్సల్స్ దళం గ్రేహౌండ్స్ నక్సల్స్ సంచారం గురించి తెలియడంతో అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపులకు దిగింది. ఛత్తీస్‌గఢ్ స్థానిక పోలీసు బలగాలు, ఇతర భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా రంగంలోకి దిగిన క్రమంలోనే పూజారి కంకెర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని వెల్లడైంది. గ్రేహౌండ్స్ బలగాల ఆపరేషన్ క్రమంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సరిహద్దుల్లో భద్రతను పెంచారు.

సార్వత్రిక ఎన్నికల దశలో ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో పలు ఎన్‌కౌంటర్లు , నక్సల్స్ మృతి, ఇదే సమయంలో నక్సల్స్ నుంచి కూడా పేలుడులు, కాల్పుల ఘటనలు జరుగుతూ ఉండటంతో ఇరు రాష్ట్రాల అంతర్ సరిహద్దుల వెంబడి భయానక పరిస్థితి నెలకొంది. ఇప్పటి ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందినట్లు, పలు ఆయుధాలు ఈ ప్రాంతంలో స్వాధీనపర్చుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రాంతంలో లోతట్టు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున నక్సల్స్ దళాల సంచారం ఉందని తెలియడంతో ఇప్పటికీ భద్రతా బలగాలు గాలింపు తీవ్రతరం చేశాయి. బీజాపూర్ జిల్లాలోనే ఈ వారం ఆరంభంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 13 మంది నక్సలైట్లు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News