Sunday, December 22, 2024

పోలీసుల పని తీరుతోనే సత్ఫలితాలు

- Advertisement -
- Advertisement -

ఐపిసి, సిఆర్‌పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది. వాటి స్థానం లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియంను జులై ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకు వచ్చింది. వీటిలో వివిధ సెక్షన్లనూ, శిక్షలనూ మార్చారు. వీటి ద్వారా సత్ఫలితాలు అందాలంటే ముందుగా పోలీసుల పని తీరు మారాల్సిన అవసరమున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ కొత్త చట్టాలు పోలీసులకు కాస్త ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చాయనే అభిప్రాయం ఉండగా.. వీటిని సద్వినియోగం చేసుకొని నేర నియంత్రణతో పాటు శాంతి భద్రతలను పరిరక్షించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందనే చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా పోలీసులే నిందితులుగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయని గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది.

ఒక్క జూన్ నెలలోనే 26 హత్యలు జరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. వీటికి తోడు హైదరాబాద్‌లో థార్, చుడీదార్, భవారియా గ్యాంగులు యథేచ్ఛగా దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగులు చేస్తున్నా వాటిని నిలువరించడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందనే చర్చ జరుగుతున్నది. ఇంకా సైబర్ నేరాలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు కోట్లలోనే సొమ్మును దోచుకుంటున్నారు. వీటికి తోడు వైట్ కాలర్ మోసాలు, రియల్ ఎస్టేట్, చీటీల మోసాలు సాధారణం అయిపోయాయి. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులపైనే కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ ఏడాది ఎసిబి అధికారులు దాదాపు 20 మంది పోలీసులపై కేసులు నమోదు చేశారు. లంచాలు తీసుకుంటున్న పలువురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఖాకీలు మహిళలపై లైంగిక దాడి చేసిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. వివిధ కారణాలతో 30 మందికి పైగా సిఐలు, ఎస్‌ఐలు సస్పెండ్ అయ్యారు. పలువురిని అటాచ్ చేశారు. దీనికి రెట్టింపుగా రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఎఎస్‌ఐలపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా పోలీసు వ్యవస్థలో కీలకమైన హాక్ ఐ, టిఎస్ కాప్, ఎస్‌ఎంఎస్ వ్యవస్థలను హ్యాకర్లు హ్యాక్ చేయడం సంచలనం సృష్టించింది.

సివిల్ వివాదాలు, సెటిల్‌మెంట్లలో సైతం పోలీసులు తలదూర్చడం ఆందోళన కలిగిస్తున్నది. కొత్త చట్టాల్లో పోలీసులకు కొన్ని ఎక్కువ అధికారాలను ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు ఏకంగా 14 రోజుల పాటు పోలీసు అధికారి ప్రాథమిక దర్యాప్తు చేయవచ్చు. ఇంకా వివిధ రకాల పవర్స్ వారికి ఇచ్చారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీసులు సమాజ హితం కోసం ఇలాంటి అధికారాలను ఉపయోగిస్తే ఎంతో మేలు జరిగే అవకాశముంటుంది. దీనికి తోడు కొన్ని చట్టాల్లో మార్పులు చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అప్పగించింది. ఈ చట్టాలను సమీక్షించి ప్రజలకు మంచి జరిగేలా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీని కంటే ముందు రాష్ట్రానికి హోం మినిస్టర్ ను నియమించాలనే అభిప్రాయం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమేర్పడింది. పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్షాళన చేయాలనే డిమాండ్ కూడా ఉన్నది. వివిధ రకాల ఆరోపణలు ఉన్న పోలీసులను తప్పించి.. వారి స్థానంలో సత్ప్రవర్తన కలిగిన అధికారులను నియమించాల్సిన అవసరమున్నది. పోలీసు శాఖలో రాజకీయ జోక్యాన్ని నివారించి, చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసి శాంతి భద్రతలను పరిరక్షించగలిగితేనే రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనించే అవకాశమున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News