Monday, December 23, 2024

బాదంపహార్ రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త రైళ్లు

- Advertisement -
- Advertisement -

జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మన తెలంగాణ / హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఒడిశాలోని బాదంపహార్ రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త మెము రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. బాదంపహార్ – టాటానగర్, బాదంపహార్ – రూర్కెలా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు బాదంపహార్ – షాలిమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అదే విధంగా ఆమె కొత్త రాయంగ్పూర్ పోస్టల్ డివిజన్‌ను కూడా వర్చువల్ గా ప్రారంభించారు . దీంతోపాటు రాయంగ్పూర్ పోస్టల్ డివిజన్ యొక్క స్మారక ప్రత్యేక కవర్ విడుదల చేసారు . ఈ సందర్భంగా బాదంపహార్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. ఏ ప్రాంతమైనా అభివృద్ధి అనేది ఆ ప్రాంతం కనెక్టివిటీపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అది రైలు, రోడ్లు లేదా తపాలా సేవలు ఇలా ఏవైనా కావొచ్చని ఆమె పేర్కొన్నారు.

ఈ సేవలన్నీ ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తాయన్నారు . మంగళవారం ప్రారంభించిన ఈ మూడు రైళ్లు జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ వంటి పొరుగు రాష్ట్రాలకు ప్రయాణించడానికి స్థానికులకు ఎంతో సహాయపడతాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఒడిశాలోని పారిశ్రామిక పట్టణం రూర్కెలాను సందర్శించడంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగదని ఆమె తెలిపారు. సెల్ ఫోన్లు , కొరియర్ సేవల ట్రెండ్ పెరుగుతున్నప్పటికీ ఇండియా పోస్ట్ తన ఔచిత్యాన్ని కోల్పోలేదని రాష్ట్రపతి అన్నారు. రాయంగ్పూర్ లో కొత్త పోస్టల్ డివిజన్ ప్రారంభోత్సవం ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన కార్యక్రమని , ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు తపాలా సేవలను సులభంగా పొందగలుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధి లేకుండా సమ్మిళిత అభివృద్ధి అసంపూర్ణమని అన్నారు. అందుకే గిరిజన సంఘాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు . గిరిజన యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వీయ అభివృద్ధి కి సొంత ప్రయత్నం కూడా అవసరమని ఉద్ఘాటించారు. యువత తమ జీవితంలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి రాష్ట్రపతి అన్నారు . పివిటిజిల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పిఎం జన్మన్‌ను ప్రారంభించిందని రాష్ట్రపతి తెలిపారు. గిరిజనుల ప్రగతికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆమె పేర్కొన్నారు. ఈ అమృత్కాల్ కార్యక్రమం ప్రజలను అభివృద్ధితో అనుసంధానం చేస్తుందని అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం రాష్ట్రపతి ముర్ము బాదంపహార్ – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో బదంపహార్ నుండి రాయిరంగపు వరకు ప్రయాణించారు.

Train 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News