తంగళ్లపల్లి : మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు సెలవుల్లో ఉండటంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.వివిధ పనులపై ఇక్కడికి వచ్చే ప్రజలకు అటెండర్‌లే సమాధానం చెబుతున్నారంటూ ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.ఉన్న సిబ్బంది పనిచేస్తారంటే ఆ సారూ వచ్చే వరకు ఆగాలంటూ చెప్పడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని గ్రామస్థులు వెల్లడిస్తున్నారు.
కార్యాలయంలో ఎంపిడివో,సూపరింటెండెంట్,జూనియర్ అసిస్టెంట్‌లు మాత్రమే కార్యాలయంలో కనిపిస్తున్నారు.అదికూడా ఎంపిడివో బద్దెనపల్లి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కావడంతో అక్కడ పనులను కూడా చూస్తుంటారు.జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామాల సందర్శన తప్పనిసరి అవుతోంది.అలాగే సూపరింటెండెంట్‌కు ఎంపివోగా అదనపు బాద్యతలు అప్పజెప్పడంతో ఆయనకు కూడా గ్రామాల సందర్శన తప్పడం లేదు.
ఉన్న జూనియర్ అసిస్టెంట్ కూడా ఎస్టివో,జిల్లా పరిషత్ అంటూ వెళుతుండటంతో కార్యాలయం బోసిపోతుంది.ఇది ఇలా ఉంటే టైపిస్టుగా పనిచేసే సిబ్బంది వేములవాడకు డిప్యూటేషన్‌పై వెళ్లాడు.సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే మహిళా ఉద్యోగి ఇటీవలే లాంగ్ లీవ్‌పై వెళ్లారు.దీంతో కార్యాలయంలో పనిచేసే ముగ్గురు అటెండర్‌లతోనే ఎంపిడివో కార్యాలయం కనిపిస్తుంది. వీళ్లు ముగ్గురు వాళ్లు ముగ్గురు మొత్తం ఆరుగురు అన్నట్లు కార్యాలయం తయారైందని ఇక్కడికి వచ్చే ప్రజాప్రతినిధులు చలోక్తులు విసురుతున్నారు.