Wednesday, January 22, 2025

పూంచ్‌లో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

జమ్ము: జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించే ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసే ముందు రెండు వైపులా కాల్పులు జరిగాయి. వాతావరణం సరిగ్గా లేక పోవడం, వర్షాలు కురుస్తుండడంతో దీన్ని అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు పూంచ్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద కంచెను దాటడానికి ప్రయత్నించారని, వారి ప్రయత్నాన్ని ఆర్మీజవాన్లు, పోలీస్‌లు అడ్డుకోగలిగారని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.

గుల్పూర్ సెక్టార్ లోని కర్మారా గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఉగ్రవాదుల కదలికలను పసిగట్టిన జవాన్లు హెచ్చరించడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఆ ప్రాంతమంతా దిగ్బంధం చేసి ఉగ్రవాదులను అదుపు లోకి తీసుకోగలిగారు. నిందితులు మొహమ్మద్ ఫరూక్ (26). మొహిద్ రియాజ్ (23), మొహిద్ జుబాయిర్ (22) అరెస్టయ్యారు. కాల్పుల్లో ఫరూక్ కాలికి గాయమైంది.

నిందితుల నుంచి భారీగా ఆయుధాలను, ప్రెసర్ కుక్కర్‌లో దాచి ఉంచిన రూ. 100 కోట్ల విలువైన 20 ప్యాకెట్ల హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను, మందుపాతరలకు ఉపయోగించే 10 కిలోల మందుగుండు(ఐఇడి) సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరు మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయాలని అనుకున్నారని పోలీస్‌లు చెప్పారు. ఆర్మీజవాన్లలో ఒకరు, ఉగ్రవాదుల్లో ఒకరు కాల్పులకు గాయపడ్డారు. జమ్ముకు చెందిన ఆర్మీ పిఆర్‌ఒ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News