జల్సాలకు అలవాటుపడి తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ముగ్గురు యువకులను లంగర్ హౌస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.8.234లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌వెస్ట్‌జోన్ డిసిపి చంద్రమోహన్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని గుంటూరుజిల్లా, సట్టంపల్లి గ్రామానికి చెందిన ఆరే సాయి అలియాస్ ఆరే సాయి ఆదిత్య కూకట్‌పల్లిలో ఉంటూ టైల్స్ పనిచేస్తున్నాడు. తిరుమలగిరికి చెందిన నమిలి డేవిడ్ రాజ్ అలియాస్ వరుణ్, కూకట్‌పల్లికి చెందిన మాగంటి సాయికుమార్ వాటర్ సరఫరా చేస్తున్నాడు. ముగ్గురు రోజు తాగడం జల్సాలు చేయడానికి అలవాటుపడ్డారు. దీని కోసం తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలు చేయడం ప్రారంభించారు. నిందితులపై మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కేసులు ఉన్నాయి.
ఈ క్రమంలోనే నిందితులు లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న వ్యాపారి శంకర్ గౌడ్ అనే వ్యక్తి సంక్రాంతి పండగకు ఇంటికి తాళం వేసి గ్రామానికి వెళ్లాడు. పండగ తర్వాత పనిమనిషి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. వెంటనే నగరానికి వచ్చిన శంకర్ గౌడ్ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి 9.750 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌస్ పోలీసులు బాధితుడి ఇంటి వద్ద నుంచి గచ్చిబౌలి వరకు 100 సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు. ప్రత్యేక టీమును ఏర్పాటు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గతంలో చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసిన సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రఘుకుమార్, డిఐ రాజేంద్రప్రసాద్ తదితరులు దర్యాప్తు చేశారు.