కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్ ,
బిఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు
బరిలో శ్రమజీవి పార్టీ నుంచి ఇద్దరు, మరో స్వతంత్ర అభ్యర్థి
అయినా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యే ఛాన్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికలకు గురువారం నామినేషన్ల గడువు ముగిసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు గానూ ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్‌కుమార్‌యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఎఐసిసి ఇంచార్జ్ దీపా దాస్ మున్శి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు గారు తదితరులు పాల్గొన్నారు. బిఆర్‌ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఎంఎల్‌ఎలు కెటిఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, దానం నాగేందర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, డాక్టర్ తెల్లం వెంకట్రావు ఉన్నారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రకు కౌశిక్‌రెడ్డి, భండా రు లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, అసెంబ్లీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కాగా శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను శుక్రవారం నాడు అధికారులు పరిశీలించనున్నారు. శాసనసభలో ఎంఎల్‌ఎల మద్ధతుతో రాజ్యసభకు అభ్యర్థులను ఎం పిక చేస్తారు. పది మంది ఎంఎల్‌ఎల బలం లేనందున జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, కిరణ్ రాథోడ్ నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉంది.
ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు, బిఆర్‌ఎస్ ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాం గ్రెస్‌కు సంఖ్యాపరంగా 64 మంది ఎంఎల్‌ఎలతోపాటు మిత్రపక్షమైన సిపిఐకి ఎంఎల్‌ఎ ఉన్నారు. అలాగే బిఆర్‌ఎస్ 39 ఎంఎల్‌ఎలు ఉండగా, బిజెపికి మంది, మజ్లిస్ పార్టీకి ఏడుగురు సభ్యుల బలం ఉంది. నిర్ణీత 39.6 శాతం ఓట్ల ప్రకారం కాంగ్రెస్‌కు ఒక స్థానం గెలిచే ఓట్లతో పాటు అదనంగా మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది. బిఆర్‌ఎస్‌కు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండో స్థానానికి పోటీ చేసే వీలు ఉండదు. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ స భ్యుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూ ల్ విడుదల చేసింది. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్‌ఎస్ ఎంపిలైన వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్‌ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.