న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అనుబంధ వివో ఇండియా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో వివో ఇండియాకు చెందిన మరో ముగ్గురు అధికారులను అరెస్టు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)తెలిపింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం( పిఎంఎల్‌ఎ)లోని వివిధ సెక్షన్ల కింద వీరిని ఇడి అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరెవరిని అరెస్టు చేశారన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. అంతకు ముందు పిఎంఎల్‌ఎ చట్టం కింద లావా ఇంటర్నేషనల్ ఎండి హరిఓం రాయ్, చైనీయుడు గౌగ్వెన్ అలియాస్ అండ్రూ కువాంగ్ ,
చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మాలిక్ అరెస్టయిన విషయం తెలిసిందే. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.గత ఏడాది జులైలో వివో ఇండియా కార్యాలయాలు,సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ల నివాసాల్లో ఇడి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయం ద్వారా రూ.62, 476 కోట్ల మేర చైనాకు వివో ఇండియా తరలించిందని ఇడి అభియోగం. వివో ఇండియాతో పాటుగా మరికొన్ని స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీలపై మనీ లాండరింగ్ కేసులు దర్యాప్తు చేస్తున్న ఇడి ఇటీవలే పిఎంఎల్‌ఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.