కొలంబో : శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు బుధవారం (జులై 20) జరగనున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమ సింఘె అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండగా, ఆయనకు పోటీగా మరో ఇద్దరు నిలబడ్డారు. శ్రీలంక పోడుజన పెరమున పార్టీ నుంచి రణిల్ బరిలోకి దిగగా, ఆయనకు పోటీగా వామపక్ష జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనుర కుమార దిశనాయకె , ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగ జన బలవెగయ సజిత్ ప్రేమదాస బరిలో ఉన్నారు. శ్రీలంక పోడుజన పెరమున నుంచి విడిపోయిన గ్రూప్‌కు చెందిన కీలక నేత దుల్లాస్ అలహప్పెరును అధ్యక్ష ఎన్నికకు పోటీ చేస్తున్నారు. దీంతో సజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు మంగళవారం ప్రకటించారు. తమ మద్దతు అలహప్పెరుమకేనని , ఆయనను గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది.
225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్ లో బుధవారం అధ్యక్ష ఎన్నిక జరగనున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు 2024 నవంబరు వరకు పదవిలో కొనసాగనున్నారు. పార్లమెంట్‌లో దాదాపు 100 వరకు అధికార పార్టీ సభ్యులో ఉన్నారు. శ్రీలంక చరిత్రలో తొలిసారిగా దేశాధ్యక్షుడి కోసం పార్లమెంట్‌లో ఎన్నిక జరగడం ఇప్పుడే. 1978 నుంచి దేశంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలే నేరుగా అధ్యక్షులను ఎన్నుకొన్నారు. అయితే 1993లో అప్పటి అధ్యక్షుడు రణసింఘె ప్రేమదేశ హత్య తరువాత అధ్యక్ష పదవికి ఎన్నిక చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రేమదాస మిగతా పదవీ కాలాన్ని పూర్తి చేసేందుకు డీబీ విజెతుంగను పార్లమెంట్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిని చేసింది.