టీమిండియా 2023లో అద్భుతమైన ప్రతిభాపాటవాలు కనబరిచింది. వన్డే ప్రపంచ కప్ లో విశ్వరూపం కనబరిచింది. కానీ ఫైనల్ రోజున అదృష్టం మొహం చాటేయడంతో ఓటమి తప్పలేదు. మహిళల టి20 ప్రపంచ కప్ లో హర్మన్ ప్రీత్ నాయకత్వంలో భారత జట్టు సెమీ ఫైనల్ దాటి ముందుకు వెళ్లలేకపోయింది. అయితే టీ20 అండర్ 19 ప్రపంచ కప్ లో మాత్రం షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచ కప్ టోర్నమెంట్లు జరగబోతున్నాయి. అవేమిటో చూద్దాం.
దక్షిణాఫ్రికాలో అండర్ 19 ప్రపంచ కప్
దక్షిణాఫ్రికాలో ఈ నెల 19నుంచి అండర్ 19 ప్రపంచ కప్ జరగబోతోంది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగవలసి ఉండగా చివరి క్షణంలో దక్షిణాఫ్రికాకు మారింది. ఉదయ్ సహారన్ నాయకత్వంలో టీమిండియా టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇండియాతోపాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా జట్లు గ్రూప్ ఏ లో ఉన్నాయి. భారత జట్టులో అర్షీన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్,రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్) ఆరవెల్లి అవినాశ్ రావు (వికెట్ కీపర్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నామన్ తివారీ ఉన్నారు.
వెస్టిండీస్, అమెరికాలలో జరిగే పురుషుల టి20 ప్రపంచకప్
పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ జూన్ 4నుంచి 30 వరకూ వెస్టిండీస్, అమెరికాలలో జరుగుతుంది. అయితే ఈ టోర్నమెంటులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడాతారా అనేది సందేహంగానే ఉంది. జట్టు ఎంపిక ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రతిభను బట్టి జరుగుతుందని భావిస్తున్నారు.
మహిళల టి20 ప్రపంచ కప్
ఇప్పటివరకూ భారత మహిళలకు అందని ద్రాక్షపండుగా ఊరిస్తున్న టీ20 ప్రపంచ కప్ ను ఈసారైనా దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో బంగ్లాదేశ్ లో జరిగే ఈ టోర్నమెంటుకోసం హర్మన్ ప్రీత్ నాయకత్వంలో భారత జట్టు ఎదురుచూస్తోంది. కొన్నేళ్లుగా సెమీపైనల్ వరకూ చేరుతున్న భారత జట్టు ఫైనల్ కు మాత్రం చేరలేకపోతోంది. 2020లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో మన జట్టు పైనల్ కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఏడాదైనా భారత మహిళల జట్టు టైటిల్ సాధిస్తుందేమో వేచి చూడాలి.