Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ పాలనలో అనర్హులకు రైతుబంధు.. రూ.25670కోట్లు వృధా

- Advertisement -
- Advertisement -

తమ ప్రభుత్వంలో పటిష్టంగా రైతు భరోసా అమలు
పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.5వేలు పెంచుతున్నాం: మంత్రి తుమ్మల

మనతెలంగాణ/హైదరాబాద్: గత బిఆర్‌ఎస్ పాలనలో అనర్హులకు రైతుబంధ పధకం అమలు చేసి రూ.25670కోట్లు ప్రజాధనం వృధా చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 గ్రామీణ నియోజకవర్గాల్లో వున్న రైతువేదికలలో, నియోజకవ వర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే ‘రైతు భరోసా’ గురించి రైతుల అభిప్రాయాలు తెలుసుకొన్నారు.

ముందుగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొస్తుందని, ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తుందన్నారు. పెట్టుబడి సహాయం కూడా సంవత్సరానికి ఎకరానికి 5000 రూపాయల చొప్పున పెంచుతున్నామని, ఐతే రైతుబంధు తరహాలో ప్రజాధనము వృధా కాకుండా ఉండేందుకు పటిష్ట విధానాలను రూపొందించేందుకు తమ ప్రభుత్వము కసరత్తు చేస్తుందని తెలియచేశారు. గతం ప్రభుత్వలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపచేసి 12 విడతలలో దాదాపు 25,670 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారని, 93శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదన్నారు. అంతేకాకుండా 17.5శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

మంత్రి మాట్లాడిన అనంతరం అన్ని జిల్లాలనుండి రైతులు మాట్లాడుతూ మంత్రి తమతో ఇలా ప్రత్యక్షంగా రైతుల అభిప్రాయాలు తీసుకోవడం శుభపరిణామం అని, రైతులకు వర్తింపచేసే పథకాలలో విధివిధానాలలో వారిని కూడా భాగస్వామ్యం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారివారి సూచనలు అందించారు. చాలా మంది రైతులు పథకాన్ని సాగుచేసే వారికి, అదేవిధంగా సాగులో ఉన్న భూమికే పెట్టుబడి సహాయం అందించాలని, అంతేకాకుండా గరిష్ట పరిమితి విధించి రైతుభరోసా పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. రైతునేస్తం కార్యక్రమంలో వెల్లడించిన, రాతపూర్వకంగా సేకరించిన సూచనలను అన్నిటిని క్రోడికరించి, ఒక నివేదిక తయారుచేయవల్సిందిగామంత్రి తుమ్మల వ్యవసాయశాక డైరెక్టర్ గోపిని ఆదేశించారు.

తమ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని, పూర్తిగా అందరి అభిప్రాయాలు తెలుసుకుని, శాసనసభలో సభ్యులతో చర్చించిన తర్వాతే పథకాన్ని తీసుకొస్తామని, ఆలస్యమైన కూడా అర్హులకు మాత్రమే అందేవిధంగా రూపకల్పన చేస్తామని స్పష్టం చేశారు. రైతునేస్తం కార్యక్రమంలో ప్రణాళికసంఘ ఉప చైర్మన్ చిన్నారెడ్డి, అఖిలభారత కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కొదండరెడ్డి, రైతుసంఘ నాయకులు అన్వెష్ రెడ్డి , వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావుతోపాటు వ్యవసాయ, ఉద్యానశాఖల డైరెక్టర్లు, జిల్లాల నుండి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News