Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లో ‘పాలేరు’ పోరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి తెలియకపోవడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఆగం అవుతున్నారు. మాజీ ఎంపి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఇద్దరూ పాలేరుపై ఆసక్తి చూపిస్తుండడంతో కేడర్ అంతా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లిద్దరిలో ఎవరికి పార్టీ హైకమాండ్ ఆశీస్సులు ఉంటాయన్న విషయం తెలియక పోవడంతో కేడర్‌లో అయోమయం నెలకొంది. ఎవరికి వారే గడపగడపకూ కాంగ్రెస్ పేరుతో గ్రామాలను చుట్టేస్తున్నారు. నిత్యం జనంలోనే ఉంటున్నారు. అయితే ఇప్పటికే అధిష్టానం పాలేరు సీటును తుమ్మలకు, ఖమ్మం సీటును పొంగులేటికి కేటాయించినట్టు

తెలిపినా మరోసారి పాలేరు సీటు విషయంలో పొంగులేటి పోటీకి వస్తుండడంతో ఈ సీటు విషయంలో అగ్గి రాజేసుకున్నట్టుగా కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీటు విషయమై పంచాయితీ అధిష్టానం వారిద్దరే తేల్చుకోవాలని వారితో పేర్కొన్నట్టుగా తెలిసింది.ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి తరఫున ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డి, అల్లుడు తుంబూరు దయాకర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ, సమావేశాలు నిర్వహిస్తుండగా పొంగులేటి కూడా ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇక కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రెండు రోజులుగా పాలేరులో తుమ్మల పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తుమ్మల పాలేరుకు గోదావరి జలాలు తీసుకురావడమే లక్ష్యమని చెబుతుండడం ఆసక్తి రేపుతోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా, మధిరలో భట్టి విక్రమార్క భద్రాచలంలో పొదెం వీరయ్య కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఆయన సూచించిన అభ్యర్థులకు సిట్టింగ్‌లు లేని నియోజకవర్గాల్లో ప్రాధాన్యం ఇస్తామని ఏఐసిసి నాయకులు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవల చేరిన సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టికెట్ కోరడం విశేషం. అయితే మిగిలిన నియోజకవర్గాల్లో పొంగులేటి తమ అనుచరులకు టికెట్‌లు ఇవ్వాలని సూచించగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వేరే అభ్యర్థులను సూచించినట్లుగా సమాచారం. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కూడా సత్తుపల్లికి వేరే అభ్యర్థిని సూచించినట్లు తెలిసింది. వీటిపై ఏఐసిసిలో చర్చించాక తుది నిర్ణయానికి వచ్చే అవకాశమున్నట్లుగా తెలిసింది.

అందరి చూపు ఈ నియోజకవర్గం వైపే ఎందుకు ?
పాలేరు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న నియోజకవర్గంగా పేరుగాంచింది. ఖమ్మం జిల్లా పరిధిలోని ఈ సీటు కోసం ప్రస్తుతం హేమాహేమీలు, దిగ్గజాలు పోటీపడుతున్నారు. తుమ్మల, పొంగులేటి, షర్మిలంతా పాలేరు వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఈ నాలుగు మండలాలతో కలిపి ఉండే పాలేరు నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ వచ్చాక ఇక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండు సాధారణ ఎన్నికలు కాగా, ఒక ఉప ఎన్నిక జరిగింది. రెండు సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ గెలిచింది. ఉప ఎన్నికలో మాత్రం బిఆర్‌ఎస్ గెలిచింది. రెడ్ల ప్రాబల్యం ఎక్కువ ఉండే ఈ నియోజకవర్గంలో బిసి, లంబాడీల జనాభా కూడా ఎక్కువే. పాత వరంగల్, పాత నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉండే పాలేరు నియోజకవర్గంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి రెడ్డిలే గెలిచారు. అంతేకాదు, మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం మూడంటే మూడే అసెంబ్లీ స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. మిగతా అన్నీ రిజర్వ్‌డ్ స్థానాలే కావడంతో, ఈ మూడు జనరల్ సీట్ల కోసం పోటీ పెరిగింది. అందులో ఈ పాలేరు ఒకటి కావడం విశేషం.

అనుచరులకు టికెట్ ఇప్పించేందుకు భట్టి, రేణుకా ప్రయత్నం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల మధ్య టికెట్‌ల పంచాయితీ నడుస్తుండగానే తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు భట్టివిక్రమార్క, రేణుకాచౌదరి విశ్వ ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. సర్వేల ఆధారంగా కేటాయింపు ఉంటుందన్న ప్రచారం ఉన్నా, ఈ ఇద్దరు నేతలకు ఏఐసిసి స్థాయిలో పలుకుబడి ఉండటంతో తమ అనుచరులకు టికెట్లు ఇప్పించడానికి వీరంతా శ్రమిస్తున్నారు. త్వరలో జరిగే స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత అభ్యర్థుల ఎంపిక కొంతమేర కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్, 5 ఎస్టీ, 2 ఎస్సీ రిజరవ్డ్ స్థానాలుండటంతో సామాజిక వర్గాల వారీగా ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నారు. మూడు జనరల్ స్థానాల్లో కొత్తగూడెంను బిసిలకు కేటాయించాలన్న డిమాండ్ ఉంది. ఎస్సీ రిజర్వ్ స్థానాలైన మధిర నుంచి భట్టివిక్రమార్క బరిలోకి దిగనుండగా సత్తుపల్లిని ఎస్సీలకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News