Monday, December 23, 2024

అమెరికాలో పిడుగులు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా 2600 విమాన సర్వీస్‌లు రద్దు చేశారు. మరో 8000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో 1320 విమాన సర్వీస్‌లు రద్దు కాగా, వాటిలో 350 న్యూజెర్సీ లోని న్యూఆర్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం లోనే ఉన్నాయి. దీంతోపాటు జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్‌పోర్ట్, లా గార్డియన్ ఎయిర్ పోర్టుల్లో అనేక సర్వీస్‌లు రద్దు చేశారు. జెఎఫ్‌కే విమానాశ్రయంలో 318 రద్దు కాగా, 426 సర్వీస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక లా గార్డియన్‌లో 270 సర్వీస్‌లు రద్దు కాగా, 292 ఆలస్యంగా నడుస్తున్నాయి.

చాలా విమానయాన సంస్థలు అడ్వైజరీలను ట్విటర్‌లో పోస్ట్ చేశాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు మరోసారి విమాన సమయాలను , వాతావరణ పరిస్థితులను చెక్ చేసుకోవాలని సూచించాయి. ఈశాన్య అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలుచోట్ల వరదలొచ్చాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెటికట్, పెన్సిల్వేనియా, మాస్సాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని, నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. ఇక కనెటికట్, మస్సాచుసెట్స్, న్యూహాంప్‌షైర్ , న్యూయార్క్ , రోడే దీవిలో టోర్నడో వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరోవైపు ఎండలు
మరోవైపు అమెరికా లోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. ఆదివారం రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వార్తలొస్తున్నాయి. ఆదివారం కాలిఫోర్నియా లోని డెత్ వ్యాలీలో ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాల్లో డెత్‌వ్యాలీ ఒకటి. కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ దాకా శక్తిమంతమైన వేడి గాలులు వీస్తున్నాయని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. సాధారణం కంటే 10 నుంచి 20 డిగ్రీల ఫారన్‌హీట్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలియజేసింది. ఆరిజోనా రాష్ట్రంలో పగటి సమయం అధికంగా ఉంటోంది. రాజధాని ఫీనిక్స్‌లో వరుసగా 16 రోజుల పాటు 109 డిగ్రీల ఫారన్‌హీట్ (43 డిగ్రీల సెల్సియస్) కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News