హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న మహిళా మోర్చా నాయకులకు బిజెపి టికెట్లు కేటాయిస్తామని, ఆ బాధ్యత తనదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. సామాన్యులను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత బిజెపికే దక్కుతుందని అన్నారు. ప్రజల్లో ఉండి పార్టీ కోసం మరింత కష్టపడాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని మహిళల సమస్యలపై బిజెపి మహిళా మోర్చా నాయకురాళ్ళు చేస్తున్న పోరాటం అభినందనీయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సింగిల్‌గా అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో మహిళా మోర్చా సమావేశం జరిగింది.
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బండి సంజయ్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వసతి శ్రీనివాసన్, పార్టీ జాతీయ కార్యదర్శి పద్మజా మీనన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కొట్లాడి పోరాటం చేస్తున్న బిజెపి కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా రాజీపడే ప్రశక్తే లేదన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందని పేదలంతా భావిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళలను కించపరిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రోజుకో హత్య, అత్యాచారం జరుగుతుంటే పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. మహిళలపై ఘోరాలు జరుగుతుంటే రాష్ట్ర హోంమంత్రి ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బిజెపి అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిఅంతు చూస్తామని, వారి ఇళ్ళను బుల్డోజర్లతో కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు.