పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ మెలిక
త్వరలోనే ఇమ్రాన్ దివాళా బడ్జెట్
విదేశీ కుట్ర వాదన బూటకమే
ఇస్లామాబాద్ : భారత్‌తో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నాం.అయితే ఎటువంటి శాంతి పరిష్కారం అయినా కశ్మీర్ అంశంతోనే ముడివడి ఉందని పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. ఇరు దేశాల మధ్య సామరస్యానికి ఆయన కశ్మీర్‌తో ముడిపెట్టారు. శాంతి స్థిరత్వం కావాలంటే ముందు కశ్మీర్ చిక్కుముడి వీడాలన్నారు. దేశ ప్రధానిగా ఎన్నికైన తరువాత షెహనాజ్ సోమవారం పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసి వెళ్లిందని, దీనిని తమ ప్రభుత్వం అతి భారీ లోటు బడ్జెట్‌గా సభకు సమర్పించాల్సి వస్తోందని తెలిపారు. పాకిస్థాన్ చరిత్రలో ఇంత దిగదుడుపు బడ్జెట్ మరోటి లేదన్నారు. ఇరుగుపొరుగుతో ప్రత్యేకించి భారత్‌తో సఖ్యత తమ ఆకాంక్ష అని, ఏ స్నేహం అయినా ముందు సంక్లిష్టతలు వీడితేనే సాధ్యం అవుతాయని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ పదేపదే చేసిన విదేశీ కుట్ర ప్రభుత్వ పతనం అంశాలు కేవలం బూటకమని, ప్రజలను పక్కదోవపట్టించడానికే అని విమర్శించారు. ఇమ్రాన్ ఆరోపణలు నిజమని ఎవరైనా నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లుతానని సవాలు విసిరారు.