మనతెలంగాణ/హైదరాబాద్: ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య(టిఫ్) తమవంతు విరాళం ఇచ్చింది. సభ్యుల విరాళాలతో 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు సమాఖ్య అధ్యక్షుడు కొండవీటి సుధీర్ రెడ్డి, ప్రతినిధులు మంగళవారం ప్రగతిభవన్‌లో ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్‌ను కలిసి కాన్సంట్రేటర్లను అందించారు.ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య కృషిని ప్రశంసించారు. మహమ్మారిని ఎదుర్కునేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, వారికి చేతనైన సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఫ్ అధ్యక్షులు సుధీర్ రెడ్డితోపాటు జాయింట్ సెక్రటరీ మిరుపాలా గోపాల్ రావు, సభ్యులు సీతాలా శంకర రావు పాల్గొన్నారు.
TIF Donates 40 Oxygen Concentrators to TS Govt