ఆవును చంపి తిన్న పులి
అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు
సిసి కెమెరాల ఏర్పాటు
మనతెలంగాణ/మంగపేట: మంగపేట మండలంలో మంగళవారం ఉదయం పెద్దపులి కలకలం సృష్టించింది. మండలంలోని కొత్తూరు మొట్లగూడె అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో కొత్తూరు మొట్ల గూడెం అటవీ ప్రాంతంలో సంచరించిన పులి ఆవును వేటాడి చంపింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధకారులకు సమాచారం ఇచ్చారు. గత రెండు రోజులుగా తాడ్వాయి అటవీ ప్రాంతంలోని కామారంలో పెద్దపులి సంచరిస్తుందని తాడ్వాయి మండల ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాలలోని గోత్తి కోయ గూడాలకు వెళ్ళి గోత్తికోయలను అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా మంగళవారం ఉదయం కొత్తూరు మొట్లగూడెం ప్రాంతంలో పెద్ద పులి ఆవును చంపిందని సమాచారాన్ని అధికారులకు అందజేశారు. అయితే గత సోమవారం నుంచి అటవీశాఖ ప్రత్యేక బృందాలు తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట అటవీప్రాంతంలో పెద్ద పులికోసం అన్వేషణ ప్రారంబించారు. ఇటీవల తాడ్వాయి మండలంలో కొంత మంది దుండగులు పెద్దపులి చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు చేసుడగా తాడ్వాయి, ఏటూరు నాగారం పోలీసులు సమన్వయంతో వారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితీ మరో సారి పెద్దపులి సంచరిస్తుందని వార్తలు వెలువడడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పెద్దపులి సంచారం నిజమే: రేంజ్ అధికారి షకిల్ పాషా
మండలంలోని కొత్తూరు మొట్లగూడెంలో పెద్ద పులి సంచరిస్తున్న విషయం నిజమే అని మంగపేట రేంజ్ అధికారి షకిల్ పాషా వివరణ ఇచ్చారు. గత సోమవారం తాడ్వాయి మండలంలోని కామారంలో పెద్దపులి సంచరిస్తుందని తెలిసిన గ్రామస్థులు సమాచారం ఇచ్చారని అన్నారు. దీంతో మంగపేట మండలంలోని గిరిజన గూడాలలో గొత్తి కోయలను అప్రమత్తం చేశామని అన్నారు. దీంతో మంగళవారం పులి ఆవును చంపిన విషయం గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో ఆయా ప్రాంతాలలో పులిని కనుగోనేందుకు సిసి కెమారాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.