* వరుసగా పశువులు మేకల మందలపై పులుల దాడులు
* మూగజీవాలపై పెద్దపులుల పంజా
మంచిర్యాల: జనారణ్యంలో పెద్దపులులు హల్‌చల్ చేస్తున్నాయి. అభయారణ్యంలో ఉండాల్సిన పెద్దపులు గ్రామాల పొలిమేరల్లోకి వచ్చి వరుసగా పశువులు మేకల మందలపై దాడులు చేస్తూ మూగజీవాలను హతమారుస్తున్నాయి. తాజాగా కొమురంభీం జిల్లా పెంచకల్‌పేట మండలం ఎల్లూరు గ్రామ శివారులలో బుధవారం లేగదూడపై పులి దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. లేకదూడపై దాడి చేసిన వెంటనే పశువులు పులి మీదకు ఎదుర్కొనేందుకు వెళ్లగా లేగదూడను వదిలి పులి అడవిలోకి పారిపోయింది. మంగళవారం సాయంత్రం కడెం ప్రాజెక్టు ఎడుమ కాల్వ సమీపంలో గొర్రెల మందలపై చిరుత పులి దాడి చేసింది. ఒక గొర్రెను హతమార్చి అటవీ ప్రాంతంలోకి లాక్కెల్లింది. చిరుత పులి సంచారంలో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. వెంటనే రంగంలోకిదిగిన అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితులను పర్యవేక్షించారు.
కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో పెద్దపుల సంచారం. పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి రావడం పశువులను హతమార్చడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అంతే కాకుండా పెంచికల్‌పేట, బెజ్జూర్, దహెగాం, మండలాల్లో పులులు పశువుల మందలపై దాడి చేసి పదుల సంఖ్యలో పశువుల హతమార్చాయి. అంతేకాకుండా గత రెండు నెలల్లో ముగ్గురు వ్యక్తులు పెద్దపులుల దాడికి గురై మృతి చెందారు. పెద్దపులులను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోనులను ఏర్పాటు చేసినప్పటికీ యత్నాలు ఫలించడం లేదు. బోనులలో సురక్షితంగా బంధించాలని అవసరమైతే మత్తు ఇంజక్షన్‌లతో పట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. వరుసగా పశువుల మందపై దాడులు చేస్తూ పశువులను హతమార్చుతుండడంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు.