వాయ్‌నాడ్(కేరళ): ఇటీవల చుట్టూ అడవి ఉన్న ఎస్టేట్‌లో కాఫీ గింజలు సేకరిస్తున్న మహిళను ఓ నరభక్షక పులి చంపేసింది. ఆ పులి సోమవారం ఉదయం గాయాలతో చనిపోయి లభ్యమైందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులి మహిళను చంపేశాక ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసన చోటుచేసుకుంది. దాంతో ఆ పులిని నరభక్షకిగా కేరళ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అంతేకాక దానిని నిర్మూలించడానికి కార్యాచరణ చేపట్టింది. అటవీ శాఖ అధికారులు రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పిలకావు ప్రాంతంలో సోమవారం ఉదయం ఆ పులి గాయాలతో చనిపోయి దొరికింది. రాధ(46) అనే మహిళను శనివారం చంపిన పులి అదేనని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
ప్రత్యేక గాలింపు చర్యల టీమ్‌కు నేతృత్వం వహించిన చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జచరియా చనిపోయిన పులి కళేబరంపై స్పష్టమైన గాయాలున్నాయని తెలిపారు. బహుశా ఆ గాయాలు మరో పులితో పోరాడినప్పుడు అయి ఉండొచ్చని ఆయన అన్నారు. ఆ పులి అదే నరభక్షక పులియా అనేది పోస్ట్ మార్టం తర్వాతే తెలియగలదని నార్తర్న్ సర్కిల్ అటవీ చీఫ్ కన్జర్వేటర్ కెఎస్. దీపా తెలిపారు. కాగా పులి గాయపడ్డాక ఆ ప్రాంతానికి చేరుకుని ఉంటుందని జచారియా తెలిపారు. చనిపోయిన ఆ పులి ఆరు లేక ఏడేళ్ల వయస్సుదయి ఉంటుందని కూడా ఆయన అన్నారు. అటవీ శాఖ మంత్రి ఏకె. శశీంద్రన్ పులి చనిపోయాక పంచరకొల్లి ప్రాంత ప్రజలకు దీంతో ఊరట చేకూరగలదని అన్నారు. ఆయన ఇటీవల రాధ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. పులిని పట్టుకునే మిషన్‌లో పాల్గొన్న అధికారులను కూడా ఆయన ప్రశంసించారు. నరభక్షక పులి చనిపోయాక పంచరకొల్లి స్థానిక ప్రజలు మిఠాయిలు పంచి సంతోషాన్ని వెల్లిబుచ్చారు.