ముందు జాగ్రత్త చర్య
వ్యవస్థ సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం
బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు రిస్క్‌లపై ఆత్మపరిశీలన చేసుకోవాలి
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: బ్యాంక్ రుణాల నిబంధనలను కఠినతరం చేస్తూ తీసుకున్న నిర్ణయం ఉద్దేశపూర్వకంగా చేసిందేనని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అన్‌సెక్యూర్డ్ లోన్ల(అసురక్షిత రుణాల)కు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. అన్‌సెక్యూర్డ్ లోన్లు పరిగణించే కొన్ని రుణాల నిబంధనలను కఠినతరం చేయడం ఉద్దేశపూర్వకంగా, లక్ష్యంగా చేసుకున్న చర్య అని ఆయన అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ సజావుగా సాగేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందని, ప్రస్తుతం దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
అయితే, బ్యాంకులు మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదాన్ని సకాలంలో గుర్తించాలని ఆయన సూచించారు. ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) సంయుక్తంగా నిర్వహించిన వార్షిక ఎఫ్‌ఐబిఎసి కార్యక్రమంలో ఆర్‌బిఐ గవర్నర్ మాట్లాడుతూ, వ్యవస్థ సజావుగా పని చేయడానికి ఇటీవల కొన్ని ఆలోచనాత్మకమైన చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. ఈ చర్యలు ముందస్తు జాగ్రత్తలు, ఆలోచనలు, లక్ష్యాల ప్రకారం తీసుకున్నామని పేర్కొన్నారు. గత వారం ఆర్‌బిఐ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సి) వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు వంటి అసురక్షిత రుణాలకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసింది.
సవరించిన నిబంధనల్లో రిస్క్ వెయిటేజీ 25 శాతం పెరిగింది. అధిక రిస్క్ వెయిట్ అంటే, వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకులు ప్రత్యేకంగా ఎక్కువ డబ్బును కేటాయించవలసి ఉంటుంది. దీంతో బ్యాంకులు ఎలాంటి ఒత్తిళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే ఈ దశ వ్యక్తులు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకోవడాన్ని ఖరీదైనదిగా చేస్తుంది. హౌసింగ్, వాహనాల కొనుగోలు కాకుండా చిన్న వ్యాపారులు తీసుకున్న రుణాలను ఆర్‌బిఐ వేరుగా చేసిందని దాస్ వెల్లడించారు. దీని ద్వారా జరుగుతున్న వృద్ధిని కొనసాగించడమే ఇందుకు కారణం, అలాగే ఈ విభాగంలో ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
ఎన్‌బిఎఫ్‌సి పనితీరు బాగుంది
బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను బలోపేతం చేయాలని, ఏదైనా ప్రతికూల వ్యాపార చక్రాన్ని ఎదుర్కొనేందుకు అదనపు చర్యలు తీసుకోవాలని ఆర్‌బిఐ గవర్నర్ కోరారు. ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ దానిని కొనసాగించేందుకు సమిష్టి కృషి అవసరమని దాస్ అన్నారు. అటువంటి మంచి సమయాల్లో బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు ప్రమాదాలు ఎక్కడ తలెత్తవచ్చో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బ్యాంకుల్లో ఎలాంటి కొత్త ఒత్తిడి తలెత్తడం లేదని, అయితే బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆర్‌బిఐ తన వంతుగా బ్యాంకులను సందర్శిస్తుందని, వాటిని తనిఖీ చేస్తుందని, వాటిపై కూడా నిఘా పెడుతుందని దాస్ వెల్లడించారు.