మాజీ ప్రధాని ప్రచండపై పోటీగా అభ్యర్థిత్వం దాఖలు
కాట్మండు : నేపాల్ లోని గుర్ఖా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, శతాధిక వయోవృద్ధుడు టికాదత్ పోఖారెల్ నేపాల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సోమవారం నాటికి ఆయన వయస్సు నూరోపడి దాటింది. నేపాల్ మాజీ ప్రధాని 67 ఏళ్ల పుష్పకమల్ దహల్ ప్రచండపై పోటీగా గోర్ఖా రెండు నియోజకవర్గాల నుంచి అభ్యర్థిగా నిలుచున్నారు.. ఎన్నికల సంఘం ఆయన అభ్యర్థిత్వాన్ని నమోదు చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతిపెద్ద వయసున్న అభ్యర్థి పోఖారెల్. తాను ప్రజలకు హక్కులను కల్పించడమే కాకుండా, మళ్లీ నేపాల్‌ను హిందూ దేశంగా మార్చేందుకే తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశానని చెప్పారు. ఆయనతోపాటు మరో 11 మంది ప్రచండకు వ్యతిరేకంగా ఈ నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. నూరేళ్ల పోఖారెల్ ఆరోగ్యం బాగానే ఉంది.
బాగా నడవగలరు, మాట్లాడగలరు, రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారని నేపాల్ కాంగ్రెస్ (బిపి) అధ్యక్షుడు సుశీల్ మన్ సెర్చన్ చెప్పారు. పోఖారెల్‌కు ఏడుగురు సంతానం. నేపాల్ కాంగ్రెస్ (బిపి) తరఫున నీటి పాత్ర గుర్తుతో ఎన్నికల్లో పోటీకి తలపడ్డారు. నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్‌కి, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20 న ఎన్నికలు జరగనున్నాయి. నేపాల్‌లో సరైన నాయకులు లేరని, కేవలం డబ్బు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని పోఖారెల్ ఆరోపించారు. నేపాల్ తన 239 ఏళ్ల హిందూ రాజరిక వ్యవస్థను 2008 లో రద్దు చేసింది. తన నూరోపుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చి అభినందనలు తెలిపిన అభిమానులతో పోఖారెల్ మాట్లాడుతూ గోర్ఖా లో ప్రతిరాయి, నేల తాను ఎలాంటి వ్యక్తినో చెబుతాయని తన ప్రత్యర్థి గురించి ప్రజలకు బాగా తెలుసునని, అందువల్ల ప్రచండను ఈ ఎన్నికల్లో ఓడించగలనని ధీమా వ్యక్తం చేశారు.