హైదరాబాదీ యువ సంచలనం తిలక్‌వర్మ ఆసియాకప్ జట్టులో చోటు సంపాదించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో తిలక్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో అతనికి ఐర్లాండ్ సిరీస్‌లోనూ జట్టులో స్థానం దక్కింది. తాజాగా ప్రతిష్టాత్మకమైన ఆసియాకప్ జట్టులో కూడా ఛాన్స్ కొట్టేశాడు. ఐపిఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచడం విండీస్‌పై రాణించడంతో తిలక్‌కు టీమిండియాలో చోటు లభించింది.
మరోవైపు గాయాలతో కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తిరిగి టీమిండియాలో చోటు సంపాదించారు. ఇద్దరు ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో జట్టులో ఛాన్స్ దక్కింది. షమి, సిరాజ్, శార్దూల్, బుమ్రా, ప్రసిద్ధ్, బుమ్రాలు ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ యాదవ్‌లు స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు. ఇక వెస్టిండీస్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన సూర్యకుమార్ యాదవ్‌కు సెలెక్టర్లు మరో ఛాన్స్ ఇచ్చారు. వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, రాహుల్‌లు వ్యవహరించనున్నారు. స్టాండ్‌బైగా ఆటగాడిగా శాంసన్‌ను ఎంపిక చేశారు.