Tuesday, February 11, 2025

తెల్లదొరలపై తొలి తిరుగుబాటు యోధుడు మాంజీ

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్ అంటేనే వీరోచిత పోరాటాల వేదిక అన్నది విదితమే. ఎన్నో ఉద్యమాలు ఆ నేలపైన ఊపిరి పోసుకున్నాయి. మరుగునపడిన స్వాతంత్య్రోద్యమ వీరుడు జార్ఖండ్‌కు చెందిన తిలకా మాంజీ వంటి గిరిజన వీరులు తమ హక్కులకోసం ప్రాణాలకు ఎదురొడ్డి పోరాటం చేశారు. సిద్ధూ, కానూ, భూమిజ్ సర్దార్, వీర బుద్ధూ భగత్, తానా భగత్, భగవాన్ బిర్సా ముండా మొదలైన యోధులు పరాయి పాలకుల గుండెలలో అగ్నిజ్వాలలు రగిలించారు. ఈ మహాయోధుల త్యాగాలకు చరిత్రపుటలలో సముచిత స్థానం లభించలేదు. జార్ఖండ్ నుంచి ఆంగ్లేయులపై వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరేసిన ఆదివాసీ యోధుడు ‘తిలకా మాంజీ’. మాంజీ బాల్యం నుంచే బ్రిటీష్ వాళ్ల అరాచకాలను, ఆకృత్యాలను కళ్లారా చూశాడు. తమ భూములను, పంటలను తెల్లదొరలు దోపిడీ చేయడం మాంజీకి ఆగ్రహం తెప్పించింది.

శనాచార్ (బనాచారి జోర్) నుంచి మాంజీ బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు. ఆయన పిలుపు మేరకు భాగల్పూర్, సుల్తాన్ గంజ్ అడవులలో గిరిజన యోధులు పోరాటం చేశారు. 1767లో 17 ఏండ్ల వయస్సు కలిగిన తిలకా మాంజీ మహల్ ప్రాంతంలో బ్రిటిష్ సైనికులతో తలపడ్డారు. వీరి పోరాట ఉధృతిని తట్టుకోలేక గిరిజన వీరులను అణిచివేయడానికి బ్రిటిష్ పాలకులు అగస్టిస్ క్లీవ్ ల్యాండ్ అనే ప్రత్యేక అధికారిని నియమించారు. 1770లో తీవ్ర కరువు వచ్చింది. ఆ కష్టకాల పరిస్థితులను ఎదుర్కొంటూనే గిరిజనులను కూడదీసిన మాంజీ దేశీయ, స్థానిక ఆయుధాలతో గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసాడు. ముంగేర్, భాగల్పూర్, సంతాల్, వర్ధణా ప్రాంతంలోని అడవులు, లోయలు, నదుల మధ్య శత్రువులతో పోరాటం చేశాడు. క్లీవ్ ల్యాండ్ వీరిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాడు.తిలకా 1784, జనవరి 13న క్లీవ్యాండ్‌ను హతమార్చాడు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం భయంతో కంపించిపోయింది.

మాంజీ తిరుగుబాటు దేశంలో బ్రిటిష్ వారిపై జరిగిన తొలి తిరుగుబాటుగా పరిగణించబడింది. ఆయనను పట్టుకుని హతమార్చాలని బ్రిటిష్ ప్రభుత్వం పథకం వేసింది. సంగీతం, నృత్యాలతో వేడుక చేసుకుంటున్న తిలకా సంతాల్ బృందం పై దేశద్రోహి అయిన ఒక భూస్వామి సహాయంతో బ్రిటిష్ సైనికులు దాడి చేశారు. తన అనుచరులను, కొందరు గిరిపుత్రులను హతమార్చారు. మరి కొందరిని నిర్బంధించారు. తిలకా మాంజీ తప్పించుకుని సుల్తాన్ గంజ్ కొండలకు చేరుకున్నాడు. బ్రిటిష్ సైన్యం అన్వేషణ కొనసాగించింది. ఫలితంగా అజ్ఞాతంలో ఉన్న సంతాల్ సైన్యం కష్టాల పాలైంది. తిండి, నీరు లేక నీరసించింది. సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు. అయినా సంతాల్ సైన్యం గెరిల్లా యుద్ధం కొనసాగించింది. దురదృష్టవశాత్తు తిలకా మాంజీ తిలాపూర్ అడవులలో పట్టుబడ్డాడు.

బ్రిటిష్ సైన్యం అతనిని అత్యంత కిరాతకంగా, నాలుగు గుర్రాలు కట్టి, నేలపై ఈడుస్తూ భాగల్పూర్ కలెక్టర్ నివాసానికి తరలించింది. 1785 ఫిబ్రవరి నెలలోనే ఒక మర్రి చెట్టుకి ఉరివేసి ఆ వీరుడిని హతమార్చింది. ఈ భూమి నా కన్నతల్లి. నా మాతృభూమి. ఈ మాతృభూమి కోసం ఎవరికో శిస్తు చెల్లించడం ఏమిటి? ‘చిన్న వయసులో ఆలోచించి పరదేశీయులను ధిక్కరించిన ధీరుడు. ఆయన త్యాగనిరతికి గుర్తుగా భాగల్పూర్‌లో ఒక విశ్వవిద్యాలయానికి తిలకా మాంజీ పేరు పెట్టారు. నీ శరీరంమీద కొరడాల వాన కురిసింది. వారు నిన్ను గుర్రాలకు కట్టి లాక్కెళ్లారు. అయినప్పటికీ వారు నిన్ను చంపలేకపోయారు. భాగల్పూర్ ప్రజల గుండెలలో నీవు సజీవుడవే, నిన్ను ఉరితాడుకు వేలాడదీశారు. అయినా భూస్వాములు, బ్రిటిష్ పాలకులు భయపడుతూనే ఉన్నారు. కోపంతో ఎర్రబడిన నీకండ్లు చావు నిన్ను మా నుంచి దూరం చేయలేదని చెబుతూనే ఉన్నాయి. నిన్ను చంపిన తర్వాత కూడా నువ్వు బతికే ఉన్నావు.

గుమ్మడి లక్ష్మీనారాయణ
94913 18409

(నేడు తిలకా మాంజీ జయంతి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News