Saturday, November 23, 2024

అప్పటి వరకు ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయవద్దు: తెలంగాణ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, పలువురు బిఎస్‌పి కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం, దోపిడి కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ప్రవీణ్ కుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రవీణ్‌కుమార్ క్వాష్ పిటిషన్‌పై తన ఉత్తర్వులు వెలువరించే వరకు హత్యాయత్నం, దోపిడీ కేసులో అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు గురువారం కాగజ్‌నగర్ పోలీసులను ఆదేశించింది.

ఇక, నాలుగురోజుల క్రితం ఎన్నికల ప్రచారం సంద్భరంగా బిఎస్‌పి, బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ప్రవీణ్ కుమార్, ఆయన కుమారుడు పునీత్‌తో పాటు మరికొంత మంది బిఎస్‌పి నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బిఎస్‌పి సమావేశాన్ని అడ్డుకోవడానికి బిఆర్‌ఎస్ ప్రచార వాహనాలు సంగీతాన్ని బిగ్గరగా పెంచారని, ఇది ఘర్షణకు దారి తీసిందని బిఎస్‌పి నాయకులు చెబుతున్నారు. తమ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బిఆర్‌ఎస్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రవీణ్ కుమార్, బిఎస్‌పి నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. సిర్పూర్ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప తనపై, తమ పార్టీ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News