మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్సీకి టిమ్ పైన్ రాజీనామా చేశాడు. 2017లో ఓ మహిళకు టిమ్ పైన్ అసభ్యకర రీతిలో తన ఫొటోతో సహా పలు సందేశాలు పంపాడని క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణలో తేలింది. తనపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి టిమ్ పైన్ తప్పుకున్నాడు. కెప్టెన్‌గా ఉండేందుకు తాను అనర్హుడినని పేర్కొంటూ సారధ్య బాధ్యతలకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2018లో టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు మళ్లీ పూర్వవైభవం సాధించడంలో పైన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌కు కూడా అతనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే తనపై ఆరోపణలు రావడంతో టిమ్ పైన్ తనంతట తానే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Tim Paine removed from Aus Test Captaincy