మన తెలంగాణ/హైదరాబాద్ : క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు మెట్రో సర్వీసుల సమయం పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. అర్దరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. మ్యాచ్ పూర్తైన తర్వాత అభిమానులు సులువుగా వారి నివాసాలకు వెళ్లేలా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు నడపనున్నట్టుగా మెట్రో ఎండి ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.
మెట్రో పిల్లర్లపై పోస్టర్లు వేయడంపై సీరియస్
ఇదిలా ఉంటే.. మెట్రో పిల్లర్లపై పోస్టర్లు వేయడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. మెట్రో రైల్ పిల్లర్లపై పోస్టర్లు వేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గల్లీ లీడర్లు ఎక్కువగా ఈ పోస్టర్లు వేస్తున్నారని చెప్పారు. సెంట్రల్ మెట్రో రూల్స్ అమలు చేస్తామని చెప్పారు. పోస్టర్లు అంటించినవారు రూ. వెయ్యి జరిమానాతో పాటు ఆరేల్లు జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు.