ఈ సమస్త విశ్వమూ కాలాధీనమై నడుస్తోంది. కాలం కంటికి కనబడనిది. అదొక పదార్థమూ కాదు. వస్తువూ కాదు. గుణమూ కాదు. శూన్యమూ కాదు. అచేతనం అనడానికి ఆధారం లేదు. సచేతనం అనడానికి స్వరూపమూ, క్రియాశీలతా లేదు. కానీ కాలం సమస్త విశ్వాన్ని నడిపించే అదృశ్యశక్తిగా మనం భావించవచ్చు. ఎంత పరిశోధించినా చివరకు తేలే యదార్థం ఇదే కావచ్చు. సాధారణంగా మనం కాలాన్ని నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలుగా విభజించుకుంటాం. ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒకరోజు అనేది ఒక ప్రమాణం. ఐతే ఇది సూర్యాస్తమయాలు స్వాభావికంగా కలిగే ఒక్క భూమికి మాత్రమే వర్తిస్తుంది. మరి ఖగోళానికో? భూమండలం దాటితే ప్రమాణాలు వేరేగా మారిపోతాయి. పూర్వులు ఇన్ని వేల సంవత్సరాలు ఒక యుగమని, నాలుగు యుగాలు ఒక మన్వంతరమని, అలాగే కల్పాలని కాల విభజన చెయ్యకపోలేదు. కానీ అవన్నీ అనంతకాల ప్రమాణంలో అంతర్భాగాలే! మనకు శాలివాహన శకం తొలుత పరిగణలో ఉండేది. తరువాత పాశ్చాత్య దృక్పథంతో క్రీస్తుశకం నడుస్తోంది. ఐతే ఈ లక్షల కోట్ల సంవత్సరాలేనా కాలపరిమితి? ఏదో ఒక ఆధారం కల్పించుకొని ప్రపంచ గమనం సాగుతోంది. ప్రముఖ అభ్యుదయ కవి సీరపాణి తన ’డమరుధ్వని’ కవితా సంపుటిలో ’కాలం’ అనే కవిత రాశారు.
ఆ కవితను వివరించడమే ప్రస్తుతాంశం.
‘కాలం గురించి ఆలోచించకు/ దాని కేంద్రం నీకు కనిపించదు/ దాని తొలి ఉచ్ఛ్వాసాన్ని/ తుది నిశ్వాసాన్ని మానవ మేధ పసికట్టలేదు/ దానికి అంచులు లేవు/ దానితో శృతి కలిపే విపంచులు లేవు’/ సాధారణంగా ఏ వస్తువుకైనా ఒక కేంద్ర బిందువు ఉంటుంది. మరి కేంద్రమే లేదంటే వస్తువూ లేనట్టే. వస్తువు లేనప్పుడు దాని గురించి ఆలోచించవలసిన అవసరమూ లేదు. అలా అని ఊరుకోవడానికి ఈ విశ్వానంతటినీ ఆవరించి, ఆవహించి ఏదో ఒక అద్భుతశక్తి ప్రవర్తిల్లుతోంది. అదే ’కాలం’ అంటే. దాని ప్రభావానికి లోను కానిదేదీ ఈ సృష్టిలోనే కాదు, సమస్త విశ్వంలోనూ లేదు. కాకపోతే అంత దురవగాహకమైన విషయం గురించి ఆలోచిస్తే ఫలితం లేదంటున్నాడు కవి. ఫలితం లేని పరిశోధన ఎందుకు? అందుకే కాలం గురించి ఆలోచించకు అంటున్నాడు కవి. అలా అని అతడు ఏ కొంతైనా తెలుసుకోవడానికి, తెలియజెప్పడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. దాని తొలి ఉచ్ఛ్వాసాన్ని, తుది నిశ్వాసాన్ని మానవమేధ పసికట్టలేదు. అంటే కాలం మొదలు గాని తుదిగాని తెలుసుకోలేం. కాబట్టి కాలం ’ఆద్యంతరహితం’ అని భావం. దానికి అంచులు లేవు అంటే, మొదలు చివర లేదని భావం. దానితో శృతి కలిపే విపంచులు లేవు అంటే, కాలం గమిస్తున్నంత కాలం దానితో మనగలిగే లేక జీవించగలిగే వస్తువు గాని, జీవిగాని ఏదీ లేదని భావం.
‘కాలం ఎప్పటికీ పూర్తికాని థీసిస్/ లెక్కలేని అంధయుగాల మేకుల్ని భరించగలిగే జీసస్/ దాన్ని అంకెలు బంధించలేవు/ దానికి అక్షరాలు భాష్యం చెప్పలేవు’/ కాలం అనే విషయం గురించి పరిశోధన మొదలుపెడితే, అది ఎప్పటికీ పూర్తికాని ’థీసిస్’ యే ఔతుందట. కాలంలో మనకు మంచికాలం మంచులా కరిగిపోతుంది. కానీ దుర్గమారణ్యం లాగానో, ఓ పర్వతం లాగానో అనుల్లంఘనీయంగా మిగిలిపోతుంది. అలాంటివే అంధయుగాలు అంటున్నాడు కవి. అలాంటి యుగాలను ఎన్నైనా భరించగలిగే శిలువ వేయబడిన జీసస్ క్రీస్తు లాంటిదని అంటున్నాడు కవి. కాల పరిణామాన్ని ఎన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు అని అంకెల్లో చెప్పలేం. అంతేకాదు దాని స్వరూప స్వభావాలను అక్షరాల ద్వారా వర్ణించలేం అంటున్నాడు కూడా. ఇంతవరకు కాలం అగణితం, అగోచరం, అనూహ్యం, ఆద్యంతరహితం అని నిర్వచించాడు కవి. అలా అని నిరాశ నిస్పృహలతో ఆ విషయాన్ని వదల్లేదు. ఇప్పుడు దానికి భౌతికత్వాన్ని ఆపాదించి కాలస్వరూపాన్ని ఎంతో కొంత మన కళ్ళకు కట్టించడానికి ఒక వింత ప్రయత్నం చేస్తున్నాడు కవి.
‘కాలం వెండితెర/ ఎంతమంది ప్రేక్షకులను చూసిందో/ ఎందరు హంతకులను మోసిందో’/ కాలం వెండితెర అంటే, వెండితెరపై ఎన్నో చిత్రాలు ఆవిష్కరించబడతాయి. కానీ ఒక్కటీ దానికి అంటదు. ఇదో గొప్ప ఉపమానం. అది ఎందరో హంతకులను మోసిందట. అంటే తరతరాలుగా యుగయుగాలుగా ఈ ప్రపంచంలో పుట్టి మానవజాతిని హింసించి మట్టుపెట్టిన హంతకులనెందరినో భరించింది. అలాగే ఏ మంచి చెడ్డలనైనా నిస్సహాయంగా చూసి సహించే వారే కాని ఏ విధంగానూ స్పందించని ప్రేక్షకులను చూసింది.‘కాలం ఇసుక ఎడారి మీద/ ఎందరి నియంతల పాదముద్రలు చెరిగిపోయాయో!/ ఎన్ని రక్తపు మడుగులు ఇగిరిపోయాయో!/ ఎన్నెన్ని కన్నీటి కెరటాలు ఇంకిపోయాయో’/ ఇసుక మీద పడిన పాదముద్రలు ఎంత కాలం ఉంటాయి? అంటే అలాంటి నియంతల సైతం కాల గమనంలో తుడుచుపెట్టుకుపోయారు. కాలం ఇసుక ఎడారి అనడంలో దుర్గమత్వం గోచరిస్తుంది. అందులో అనేక యుద్ధాల్లో, పోరాటాల్లో ప్రవహించిన రక్తపు మడుగులు ఇగిరిపోయాయట. అలాగే అనేక జీవితాల్లో పొంగిపొర్లిన కన్నీటి కెరటాలు సైతం ఇంకిపోయాయట.
‘అది ఎన్ని ఆకలి చావులను చూసిందో!/ ఎన్ని ఆర్తారావాలని ఆలకించిందో!/ ఎన్ని మోసాలను, ద్వేషాలను, కుట్రలను, ఖూనీలను,/ వ్యూహాలను, యుద్ధాలను/ చూసిందో రోసిందో బిక్కమొగం వేసిందో!/ వెక్కివెక్కి ఏడ్చిందో’/ కాలం ఎన్నో ఆకలి చావులను చూసింది. ఎన్నో ఆర్తనాదాలను ఆలకించిందట. అంతేకాదు నాగరిక సమాజంలో సైతం మోసాలూ, ద్వేషాలూ, కుట్రలూ, ఖూనీలూ, వ్యూహాలూ, యుద్ధాలూ ఏ కాలానికి ఆ కాలంలోనే జరిగాయి. అది వాటనన్నింటినీ కళ్లారా చూసింది. ఏమి చేయలేని స్థితిలో బిక్కమొగం వేసింది. అంతేకాదు తానిచ్చిన ఆయుష్షును పోసుకున్న మానవజాతి ఇంతకూ వివేకహీనంగా, ఘోరంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నదని వెక్కివెక్కి ఏడ్చిందట./‘అందుకే అంటున్నాను/ కాలం మూగది/ ఎవ్వరినీ ఏమీ అనలేదు/ మానవుడినీ దానవుడినీ/ ఒకే కడుపున కన్నతల్లి లాగ’/ ఇన్ని అవాంఛనీయాలు జరుగుతున్నా, ఎవరినీ ఎందుకు ఏమీ అనలేకపోయింది కాలం? అందుకే కాలాన్ని మూగది అంటున్నాడు కవి. ఎంత గొప్ప పోలిక! మానవుడినీ దానవుడినీ ఒకే కడుపున మోసిన తల్లిలాగ ఎవరినీ ఏమీ అనలేదట./‘ఇద్దరికీ తన రక్తాన్ని/ సమంగానే పంచి పెడుతుంది/ కాని,/ ఒకడిని చూసి ఫక్కున నవ్వుతుంది/ మరొకడిని చూసి భోరున ఏడుస్తుంది’/ జీవితకాల ప్రమాణం ఉభయులకు సమానంగానే ప్రసాదిస్తుంది. కాని సన్మార్గుణ్ణి చూసి ఆనంద పడుతుందట. దుర్మార్గుణ్ణి చూసి భోరున విలపిస్తుందట.
‘అయినా, / మంచిని పెంచుకోవడానికి/ మరింత అవకాశం లేకపోలేదంటుంది’/ ఇంతవరకు తెలిసో తెలియకో కాలమెంత సంక్షుభితంగా జరిగినా, రాబోయే కాలంలోనైనా మంచిగా బ్రతకడానికి మరింత అవకాశం ఉన్నది అంటోంది./‘ఈ మాటే నిజం కాకపోతే/ పీడకలల పాడుముద్రలు ఆక్రమించుకున్న/ కాలం కేన్వాస్ మీద/ ఆకాశమంత ఖాళీ ఎందుకు మిగిలినట్టు’/ మానవజాతి తన ప్రవర్తనను సరిదిద్దుకొని మంచిగా బ్రతకడానికి మరింత కాలం ఎలా ఉందని అంటున్నాడు? కాలం ఒక చిత్రకారుడి కేన్వాసు లాంటిదట. ఇప్పటికే దానిపై ఎన్నో పీడకలల పాడుముద్రలు ముద్రితమైపోయాయట. ఐనా ఆకాశమంత ఖాళీ ఇంకా మిగిలే ఉందట. అంటే ఈ భూమిపై మానవుడు సహజాతమైన, సహవాస లభ్యమైన అనేక అమానుష కృత్యాలను విడనాడి సౌజన్యమూ, సౌహార్దమూ, సౌభాత్రముతో కూడిన ప్రవర్తనను అలవరుచుకొనడానికి ఎంతో అవకాశం ఉంది. తన్మూలంగా శాంతియుత సహజీవనాన్ని సాధించవచ్చునని కవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి దురవగాహమైన అజ్ఞాతమైన అంశాన్ని కవితా వస్తువుగా తీసుకోవడం ఎక్కడా కనబడదు. జ్ఞానులు, విజ్ఞానులు, వయోవృద్ధులు,
వులు మాత్రమే ఆలోచించవలసిన ఇలాంటి అంశం గురించి పాతికేళ్ళయినా నిండని విద్యార్థి దశలో సీరపాణి స్పృశించడం, తనకు సాధ్యమైనంత ఎత్తుల్ని అందుకోవడం ఒక సాహసకృత్యమే. ఆంధ్రపత్రిక, భారతి వంటి పత్రికల్లో ’డమరుధ్వని’ కవితా సంపుటి గురించి గ్రంథసమీక్ష చేస్తూ ఏభై ఏళ్ల క్రిందట ప్రఖ్యాత పండితుడు, విమర్శకుడైన ’మరువూరు కోదండరామిరెడ్డి’ గారు ఇలా అంటారు. ‘ఈ కవి కాలం గురించి ఐన్ స్టీన్ వలె లోతుకు దిగి వివరించినాడు‘ ఇంతకంటే కవికి గొప్ప ప్రశంస ఏముంటుంది?