హైదరాబాద్ : అదును దాట లేదు, ఆందోళన చెందవద్దు, ఈ సంవత్సరం, వానాకాలంలో సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని, వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పుడు నార్లు పోసుకోవాలనుకునే రైతులు కేవలం స్వల్పకాలిక (125 రోజుల కన్నా తక్కువ) వరి రకాలను మాత్రమే విత్తుకోవాలని, ‘ నేరుగా విత్తు పద్ధతులపై (దమ్ముచేసి లేదా దమ్ము చేయకుండా) రైతాంగం శ్రద్ధ వహించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా.పి. రఘు రామిరెడ్డి రైతులకు పంటలవారీగా పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. వివిధ రకాల పంటలను విత్తుకోవడానికి సమయం దాటిపోలేదని, కావున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలియచేశారు. కేరళను జూన్ 1వ తేదీన తాకాల్సిన రుతుపవనాలు ఈ సారి 8వ తేదీన తాకాయని, అయితే, ఈ సమయంలోనే గుజరాత్ తీరంలో ఏర్పడిన తుఫానుల వలన మన రాష్ట్రంలోకి ఇప్పటివరకు రుతుపవనాలు ప్రవేశించలేదని, కానీ, రెండు-,మూడు రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వారు తెలియజేసిందని ఆయన పేర్కొన్నారు.
రైతులకు ఇచ్చిన సలహాలు ఇలా…
పత్తి: పత్తిని జూలై 20వ తేదీ వరకు విత్తుకోవచ్చు. ‘తేలిక నేలల్లో 50, -60 మి.మీ.లు, బరువు నేలల్లో 60, -75 మి.మీల. వర్షపాతం నమోదయిన తర్వాత మాత్రమే పత్తిని విత్తుకోవాలి. ప్రత్తిలో అంతర పంటగా కంది మంచి లాభాలు ఇస్తుంది. కావున అంతర పంటల సాగును రైతులు చేపట్టాలి.
కంది: కంది పంటను పెసర, మినుము, వేరుశెనగ, ప్రత్తి, ఆముదాన్ని ఇతర పంటలతో అంతర పంటగా విత్తుకోవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఆగష్టు 15 వరకు కందిని వేసుకోవచ్చు.
సోయాచిక్కుడు: సోయాచిక్కుడును జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి జూలై మొదటి వారం వరకు సోయాలో మంచి దిగుబడులు సాధించవచ్చు.
మొక్కజొన్న: జూలై 15వ తేదీ వరకు మొక్కజొన్నను విత్తుకోవచ్చు.నీటి ఎద్దడిని మొక్కజొన్న తట్టుకోలేదు. కాబట్టి, బోదె, సాళ్ల పద్ధతి ఆచరించడం ద్వారా పంటకు ఎక్కువ కాలం తేమను అందుబాటులో ఉంచవచ్చు.
పెసర, మినుము: ఈ పంటలను జూలై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. సరైన మొక్కల సంఖ్యను పాటించడం ద్వారా ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఇతర ఆరుతడి పంటలైన ఆముదాలు, ప్రొద్దుతిరుగుడు, ఉలువలను జూలై 31వ తేదీ వరకు రైతాంగం సాగు చేసుకోవచ్చు. కావున రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.